MLA Lasya Nandita: వెంటాడిన మృత్యువు.. ఎమ్మెల్యే దుర్మరణం

Byline :  Veerendra Prasad
Update: 2024-02-23 01:52 GMT

బీఆర్ఎస్ లీడర్ , సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ప్రమాదంలో మరణించారు. పటాన్ చెరు ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ఘటనాస్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ కు తీవ్రగాయాలు కాగా.. కారు నుజ్జునుజ్జయింది. గతేడాది ఆమె తండ్రి, బీఆర్ఎస్ నేత సాయన్న మరణించడంతో... 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సాయన్న స్థానంలో లాస్య నందితతో బీఆర్‌ఎస్‌ పోటీ చేయించింది. 17169 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు.

ఇటీవల నల్గొండ బీఆర్ఎస్ సభకు హాజరైన సమయంలోనూ ఆమె రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నార్క‌ట్‌ప‌ల్లి వ‌ద్ద లాస్యనందిత ప్ర‌యాణిస్తున్న కారును ఓ టిప్ప‌ర్ ఢీకొట్టింది. దీంతో ఆ కారు ముందు టైర్ ఊడిపోయింది. ఎమ్మెల్యే లాస్య త‌ల‌కు స్వ‌ల్ప గాయ‌మైంది. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారని భావిస్తున్న తరుణంలోనే మరోసారి రోడ్డు ప్రమాదం రూపంలో ఆమెకు మృత్యువు ఎదురైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19 న ఆమె తండ్రి సాయన్న అనారోగ్యంతో మరణించారు. ఏడాది లోనే ఆమె కూడా కన్నుమూయడం కుటుంబసభ్యులు, అభిమానులు , కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని భావిస్తున్న తరుణంలో.. చిన్న వయసులో ఇలా దుర్మరణం కావడం పట్ల పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News