Rythu Bandhu: రైతు బంధుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Byline :  Veerendra Prasad
Update: 2023-12-13 05:33 GMT

యాసంగి పంటలు సాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు (Rythu Bandhu) పెట్టుబడి సాయం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. మంగళవారం ఎకరా లోపు విస్తీర్ణం కలిగిన రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు సాయం అందించగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే... రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, రైతు భరోసా పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాకపోవడంతో ఈ సీజన్‌కు గతంలో మాదిరిగానే (రైతు బంధు లాగా) రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంతకు ముందు లాగే ఆరోహణ క్రమంలో మొదట తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల ఖాతాల్లో నుంచి ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతు బంధు స్కీమ్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ (IT) కట్టేవారికి, వందల ఎకరాలు ఉన్నవారికి రైతు బంధు నిధులు ఇవ్వడం సమంజసం కాదని అన్నారు. కేవలం భూమి సాగు చేసేవారికే రైతు బంధు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన రైతు భరోసా స్కీమ్ విధివిధానాలపై పరిశీలన జరుగుతోందని తెలిపారు. నిజమైన రైతులకే పంట పెట్టుబడి సాయం చేయాలని అన్నారు. కొన్ని రోజుల క్రితం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇదే అంశం గురించి మాట్లాడుతూ.. సాగుభూములకే రైతు బంధు అంటూ వస్తున్న వార్తలు.. వట్టి పుకార్లేనని అన్నారు. గతంలో ఎలాగైతే రైతు బంధువచ్చేదో తమ ప్రభుత్వం కూడా అలాగే ఇస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడే అదే పార్టీకి చెందిన మరో నేత జీవన్ రెడ్డి భూమి సాగు చేసేవారికే రైతుబంధు అని చెప్పడంతో జనాలు అయోమయంలో పడ్డారు.




Tags:    

Similar News