సీనియర్ నాయకులు ,మాజీ రాజ్యసభ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సోలిపేట మంగళవారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలోని తన ఇంట్లో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన పార్థీవదేహాన్ని సందర్శనార్థం అక్కడే ఉంచనున్నారు. ఈ సాయంత్రం ఫిలింనగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సుమారు 70 ఏళ్ల పాటు రామచంద్రారెడ్డి రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోశించారు. తన సేవలతో మచ్చలేని నాయకునిగా పేరు సంపాదించుకున్నారు.
హరీష్‌రావు సంతాపం :
రామచంద్రారెడ్డి మరణంపట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. "తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన పోషించిన పాత్ర ఎందరికో స్ఫూర్తిదాయకం. సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎదిగిన ఈ ప్రజా నేతగా ప్రజల మన్ననలు పొందారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన నాయకులు రామచంద్రారెడ్డి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని మంత్రి తెలిపారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక చిట్టాపూర్ గ్రామం. రామచంద్రారెడ్డి స్వస్థలం. కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో భాగమయ్యారు. సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎంపీ వరకు ఎదిగి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు సోలిపేట. కాంగ్రెస్, టీడీపీ, లోక్‌సత్తా వంటి పార్టీలలో పని చేసిన సోలిపేట. గత కొంతకాలంగా పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. భారత చైనా మిత్రమండలికి ప్రెసిడెంట్‌గా, సి. ఆర్. ఫౌండేషన్, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు వంటి సంస్థల్లో మెంబర్‌గా సేవలందించారు.