Student Pravalika: ప్రవళిక కేసులో కీలక పరిణామం.. శివరామ్ అరెస్ట్

Update: 2023-10-18 07:59 GMT

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో నేడు కీలక పరిణామం చేసుకుంది. ఈ కేసులో నిందితుడు అయిన శివరామ్‌ రాథోడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రవళిక మృతి తర్వాత పరారీలో ఉన్న శివరామ్‌.. తాజాగా పోలీసులకు చిక్కాడు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవళిక ఈనెల 13 రాత్రి సమయంలో.. హైదరాబాద్‌లో తాను ఉంటున్న హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గ్రూప్‌-2 పరీక్ష రద్దు కావడంతోనే ప్రవళిక ఇంతటి దారుణానికి పాల్పడిందని విపక్షాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. కానీ ఆమె తల్లి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో అవన్ని సద్దుమణిగాయి.

ప్రేమించిన వాడు మోసం చేయడం వల్లనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని నిర్థారించిన హైదరాబాద్‌ చిక్కడపల్లి పోలీసులు ఆ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లా వాసి శివరామ్‌.. తనను మోసం చేశాడన్న విషయాన్ని ప్రవళిక తన సోదరుడు ప్రణయ్‌కి వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా తెలిపింది. ఈ క్రమంలో ప్రవళిక సోదరుడు ప్రణయ్‌ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు.. తాజాగా శివరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఐపీసీ 420,417, 306 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా.. తాను ప్రేమించిన శివరామ్ రాథోడ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. ప్రవళిక గ్రూప్-2 తో పాటు ఎలాంటి పోటీ పరీక్షలు కూడాా రాయలేదని ప్రకటించారు. హైదరాబాద్ లోని హస్టల్ లో 15 రోజుల క్రితమే ఆమె చేరిందన్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు శివరామ్‌తో ప్రవళిక చాటింగ్ చేసిందని కూడా డీసీపీ వివరించారు. ప్రవళిక రాసినట్టుగా ఉన్న సూసైడ్ నోట్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్టుగా డీసీపీ వివరించారు.

Tags:    

Similar News