Shocking Incident :అమ్మాయికి బొట్టుపెట్టాడు, హతమయ్యాడు.. షాద్‌నగర్‌లో ఘోరం...
షాద్‌నగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమ్మాయికి బొట్టుపెట్టాడని ఓ యువకుడిని యువతి తండ్రి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో తన కూతురిని వేధిస్తున్నాడంటూ విచక్షణ కోల్పోయిన యువతి తండ్రి సినీ ఫక్కీలో ఓ యువకుడిని కిరాతకంగా చంపేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేపింది.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో ఈఘోరం జరిగింది. బీహార్‌కు చెందిన కరుణాకర్ కుటుంబం గత కొన్నేళ్లుగా కేశంపేటలో ఉంటోంది. స్థానికంగా చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. అయితే ఉన్నట్లుండి ఆగష్టు 29వ తేదీ నుంచి కరుణాకర్ కనిపించకుండా పోయాడు. దీంతో కరుణాకర్ జాడ కోసం అతని సోదరుడు దీపక్ పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు. ఈ క్రమంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. రంజిత్ కుమార్ అనే వ్యక్తి ప్లాన్ ప్రకరం కరుణాకర్‌ను హతమార్చాడని పోలీసులు తేల్చేశారు. దీంతో ఈ విషయం స్థానికంగా సంచలనంగా మారింది. కరుణాకర్, రంజిత్ కుమార్ కూతురిని ప్రేమ పేరుతో గత కొంత కాలంగా వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో ఆమె నుదుటిపై సింధూరం కూడా దిద్ది ఆమెను ఇబ్బంది పెట్టాడు. ఈ విషయం తెలిస్తే పరువుపోతుందని భావించిన రంజిత్, కరుణాకర్‌పై రగిలిపోయాడు. దీంతో ఎలాగైనా కరుణాకర్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
ఆగష్టు 15న నిడదవెళ్లి గ్రామం నుంచి జూలపల్లి వెళ్లే రోడ్డులో ఉన్న వరి చేను దగ్గరికి కరుణాకర్‌ను పిలిపించి రంజిత్ విచక్షణా రహితంగా దాడికి దిగాడు.బురదలో అతడిని ముంచి హత్య చేసి అదే బురదలో పాతిపెట్టాడు. పోలీసుల దర్యాప్తులో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రంజిత్‌తో పాటు అతనికి సహకరించిన వారిని అరెస్ట్ చేశామని శంషాబాద్ డీసీపీ మీడియాకు తెలిపారు. నిందితులపై 302, 201 ,34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.