జీ20 సదస్సులో కరీంనగర్ కు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ వేదికగా శని, ఆదివారాల్లో (సెప్టెంబర్ 9,10) జరిగే ఈ సదస్సులో ప్రపంచ దేశాల అతిథులు ధరించే కోటుపై.. కరీంనగర్ వెండి తీగ నగిషీ మెరవనుంది. జీ20 సమావేశాల నేపథ్యంలో కరీంనగర్ కు చెందిన కళాకారుడు ఎర్రోజు అశోక్ సిల్వర్ ఫిలిగ్రి అశోక చక్ర బ్యాడ్జీలను తయారుచేశాడు. ఈ నేపథ్యంలో మొత్తం 200 సిల్వర్ బ్యాడ్జీలను ఢిల్లీకి పంపినట్లు అశోక్ తెలిపాడు. సమ్మిట్ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల కళాత్మక చేతి నైపుణ్య కళాఖండాలను ప్రదర్శించేందుకు స్టాళ్లు ఏర్పాటు చేశారు. కాగా అందులో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాత్మక వస్తువుల ప్రదర్శనకు ప్రత్యేకంగా ఒక స్టాల్ దక్కడం విశేషం. ఈ స్టాల్ ను ఎర్రోజు అశోక్ నిర్వహిస్తున్నాడు. ఈ హస్తకళ అంతరించి పోతున్న దశలో మళ్లీ జీవం పోసుకున్నందుకు ఆనందంగా ఉందని అశోక్ తెలిపాడు.