TSPSC case : దూకుడు పెంచిన సిట్.. ఈ వారంలో మరిన్ని అరెస్టులు

Update: 2023-06-05 02:40 GMT

టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడు పెంచింది. దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు మరికొందరిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది. దాదాపు రెండున్నర నెలలుగా కొనసాగుతున్న దర్యాప్తులో ఇప్పటి వరకు 50 మంది వరకు అరెస్ట్ అయ్యారు. విచారణలో వారు చెప్పిన వివరాల ఆధారంగా ఈ వారంలో పలువురిని అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం.

పేపర్ లీకేజీ కేసులో అరెస్టైన వరంగల్ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ డీఈఈ రమేష్ నుంచి దాదాపు 30 మంది వరకు ప్రశ్నాపత్రం కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దర్యాప్తులో లభించిన సాక్ష్యాల ఆధారంగా అధికారులు రమేష్ ను అరెస్ట్ చేశారు. విచారణలో అతను మాస్‌కాపీయింగ్‌ చేయించినట్లు గుర్తించారు. లీకేజీలో ప్రధాన నిందితుడైన ప్రవీణ్‌.. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలను తన ఇంటికి దగ్గరలో ఉండే టీఎస్‌పీడీసీఎల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ సురేష్‌కు ఇవ్వగా అతడు ఏఈఈ,డీఏవో ప్రశ్నపత్రాలను 25 మందికి అమ్మినట్లు గుర్తించారు.

ఏఈఈ, డీఏవో పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూసిన ఓ కాలేజీ ప్రిన్సిపల్‌ తో కలిసి రమేష్ ఓ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకొని మాస్‌ కాపీయింగ్‌ కు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలింది. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఈఈ పరీక్షలో నలుగురు, డీఏవో పరీక్షలో ముగ్గురు మాస్‌కాపీయింగ్‌ చేయించినట్లు తేలింది. దీంతో పాటు ఏఈఈ క్వశ్చన్ పేపర్ ను మరో 30 మందికి అమ్ముకున్నట్లు విచారణలో వెల్లడైంది. మరోవైపు సురేష్‌ సైతం 78 మందికి ఏఈఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించినట్లు సిట్ అనుమానిస్తోంది. విచారణలో వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ వారంలో మూకుమ్మడిగా పలువురిని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News