Nalgonda:నిండా పాతికేళ్లు లేవు.. ప్రేమజంటలపై నేరాలకు తెగబడుతున్రు
ఒంటరిగా కనిపించే ప్రేమ జంటలను టార్గెట్ చేస్తూ వారిని బెదిరించి అందినకాడికి దండుకుంటున్న ముఠా ఒకటి నల్గొండ పోలీసులకు చిక్కింది. ప్రేమ జంటలు సన్నిహితంగా ఉన్న సమయంలో.. రహస్యంగా వీడియోలు తీసి.. ఆ వీడియోలు లీక్ చేస్తామంటూ ఓ ఆరుగురి ముఠా దారుణాలకు తెగబడుతోంది. నల్గొండ జిల్లాలో ఈ వైనం వెలుగుచూసింది. వీడియోలు లీక్ చేస్తామని బెదిరిస్తూ ప్రేమజంటల నుంచి డబ్బు, నగలు గుంజుకుంటున్నారు ఆరుగురు యువకులు. నల్గొండ పీఎస్ లో ఇందుకు సంబంధించి ఫిర్యాదులు అందడంతో పోలీసులు వారి భరతం పట్టారు. ఆ ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో కుంచం చందు(21), కుంచం ప్రశాంత్(19), చింతా నాగరాజు(23), అన్నెపూరి లక్ష్మణ్(23), శివరాత్రి ముకేశ్(18), కుంచం రాజు(23) లు ఉన్నారు. నిందితుల నుంచి బంగారు ఉంగరాలు, సెల్‌ఫోన్లు, ఖరీదైన వాచీలు, 2 టీవీలు, డ్రిల్లింగ్ మిషన్, ఇన్వర్టర్ స్వాధీనం చేసుకున్నారు.