Kagaznagar Train: సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ రైలులో పొగలు
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ రైలులో ఆదివారం ఉదయం పొగలు రావడం కలకలం రేపింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుండి పొగలు వస్తున్న విషయాన్ని గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే చైన్ లాగి రైలును ఆపివేశారు. భయంతో ట్రైన్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి రైలు బయల్దేరింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గతంలో కూడా పలు రైళ్లలో మంటలు వ్యాపించడంతో పాటు పొగలు వచ్చిన ఘటనలు చోటు చేసుకున్నాయి. 2023 ఆగస్టు 13వ తేదీన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు వచ్చాయి. దీంతో స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వే స్టేషన్ లో రైలును నిలిపివేశారు. ఈ రైలుకు చెందిన నాలుగో కోచ్ నుండి పొగలు రావడంతో గుర్తించిన ప్రయాణీకులు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు.స్టేషన్ ఘన్ పూర్ రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. మరమ్మతులు నిర్వహించిన తర్వాత రైలును తిరిగి పంపారు. ఇంటర్ సిటీ రైలులో 2021 జూన్ 16న కూడ పొగలు వచ్చాయి. తలమడుగు మండలం డోర్లి గేటు వద్ద రైలు ఇంజన్ లో పొగలు వచ్చిన విషయాన్ని గుర్తించి నిలిపివేశారు. నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 16న మహబూబాద్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. అహ్మదాబాద్ నుండి చెన్నైకి రైలు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.