Danam Nagender : BRS ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై భూకబ్జా ఆరోపణలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూమిని కబ్జా చేశారంటూ హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద కొందరు బాధితులు ఆందోళనకి దిగారు. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ప్రజాభవన్ వద్ద ప్రజావాణి పేరుతో ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి ప్రజావాణికి ప్రకాష్ నగర్ బేగంగపేట్‌కు చెందిన బాధితులు.. కష్టపడి కొనుక్కున్న భూములని ఎమ్మెల్యే దానం... ఆయన అనుచరులతో కబ్జా చేయించాడని ప్లెక్సీలతో నిరసన వ్యక్తం చేశారు. దానం నాగేందర్ తమను హింసిస్తున్నాడని.. ఆయన నుంచి తమ భూములు కాపాడి తమకు అప్పగించాలని కోరుతున్నారు.
ఆందోళన చేస్తున్న సమయంలో వీడియో తీస్తున్న దానం నాగేందర్ అనుచరుడిపై దాడి చేశారు బాధితులు. నాగరాజు అనే వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. దీనిపై దక్షిణ మండల డీసీపీ విజయ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ బేగంపేట్ లోని ప్రజాభవన్లో ప్రజావాణి జరుగుతోంది. సిటీతో పాటు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు ప్రజావాణికి తరలివచ్చారు. ఇందులో ఎక్కువగా భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారే ఉన్నారు. తెల్లవారుజాము నుంచే పబ్లిక్ ప్రజా భవన్ దగ్గరకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి కొనసాగనుంది. హైదరాబాద్ తో పాటు జిల్లాల నుంచి తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకునేందుకు జనం వచ్చారు.