Khammam Lok Sabha Seat : తెలంగాణ నుంచి పోటీ చేయండి సోనియా గాంధీని కోరిన రేవంత్, భట్టి

Update: 2024-02-06 01:34 GMT

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీసీఎం మల్లు భట్టి విక్రమార్కు కోరారు. న్యూఢిల్లీలోని సోనియా అధికారిక నివాసం 10, జ‌న్‌ప‌థ్‌లో సమావేశమయ్యారు. ఇప్ప‌టికే పీసీసీ తీర్మానించిన విష‌యాన్ని ఆయ‌న సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఇచ్చిన త‌ల్లిగా రాష్ట్ర ప్ర‌జ‌లు గుర్తిస్తున్నందున రాష్ట్రం నుంచి పోటీ చేయాల‌ని కోరుతున్న‌ట్లు తెలిపారు. స్పందించిన సోనియా గాంధీ స‌రైన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాన‌ని తెలిపారు.భేటీ అనంతరం డిప్యూటీసీఎం భట్టి మీడియాతో మాట్లాడారు. భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్నిక‌లకు ముందు ఇచ్చిన ఆరు హామీల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రాజీవ్ ఆరోగ్య‌శ్రీ ప‌రిమితిని రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.15 ల‌క్ష‌లకు పెంచ‌డాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని వివ‌రించారు. బ‌స్సుల్లో ఇప్ప‌టికే 14 కోట్ల మంది మ‌హిళ‌లు ఉచిత ప్ర‌యాణం చేశార‌ని ఆయ‌న తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలెండ‌ర్ అంద‌జేత‌, 200 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్ ఉచిత స‌ర‌ఫ‌రా అమ‌లుకు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని సోనియా గాంధీకి సీఎం తెలియ‌జేశారు. బీసీ కుల గ‌ణ‌న చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించామ‌ని, ఇందుకు సంబంధించి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో అత్య‌ధిక స్థానాలు సాధించేందుకు వీలుగా ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే అన్ని ర‌కాలుగా స‌న్నాహాలు పూర్తి చేసిన‌ట్లు సోనియాగాంధీకి వారు వివరించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆశావాహుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించామ‌ని, వాటిపై పూర్తిస్థాయిలో క‌స‌ర‌త్తు చేసి బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తామ‌ని ఆయ‌న వివ‌రించారు.

భార‌త్ న్యాయ్ యాత్ర‌లో సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భార‌త్ న్యాయ్ యాత్ర‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జార్ఖండ్ రాజ‌ధాని రాంచీలో కొన‌సాగుతున్న న్యాయ్ యాత్ర‌లో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి క‌లిశారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంట‌నే విడుద‌ల‌య్యేలా స‌హ‌క‌రించాల‌ని నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ సుమ‌న్ భేరీకి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. న్యూఢిల్లీలో నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్‌ను సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి క‌లిశారు.హైద‌రాబాద్‌లో మూసీ న‌ది రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధికి అవ‌స‌ర‌మైన నిధులు ఇప్పించాల‌ని సీఎం కోరారు. 




Tags:    

Similar News