విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవు..తెలంగాణ సర్కార్ ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఇప్పటికే చాలా వరకు నగరాలు జలదిగ్భందంలో ఉన్నాయి. రహదారులన్నీ వర్షపు నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం కూడా విద్యాసంస్థలకు సెలవును ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే స్కూల్స్ బుధ, గురువారాలను సెలవు దినంగా ప్రకటించాయి. తాజా ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం వరకూ ఈ సెలవులను పొడిగించనున్నారు. మరోవైపు శనివారం మొహర్రం, ఆ తర్వాత ఆదివారం కావడంతో విద్యాసంస్థలకు వరుస సెలవులు వచ్చినట్లైంది. ఇదిలా ఉంటే భారీ వర్షాలు , వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. అత్యవసరమైతేనే బయటికి రావాలని తెలిపింది.