అధికారంమే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు.. గ్రౌండ్ రిపోర్టులతో ప్రజల్లోకి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్స్ వేసి.. వారి సెగ్మేంట్లపైనే దృష్టి పెట్టారు. ప్రచారాన్ని ముమ్మరం చేసి ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీ అధినేతలు నియోజకవర్గాలన్నీ తిరుగుతూ ప్రచారం చేస్తుంటే.. అభ్యర్థులు డివిజన్ల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే కేసీఆర్ పార్టీ సెకండ్ ఫేజ్ ప్రచారం ప్రారంభించగా.. మరో కొన్ని రోజుల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ క్యాంపెయిన్ ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే మోదీ రాష్ట్రానికి రెండు సార్లు వచ్చి భారీ సభల్లో పాల్గొనగా.. మరో మూడు రోజుల పర్యటనకు తేదీలు ఖరారు అయ్యాయి. బీజేపీ బడా నేతలు అమిత్ షా, నడ్డాలు సహా పలువురు ముఖ్య నేతలు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. దీంతో తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా మారనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఒకరిపై మరొకరు దమ్మెత్తి పోసుకుంటున్నారు. ఒకరిని మించి మరొకరు హామీలు, డిక్లరేషన్లు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల గాలి ఏ పార్టీ వైపు మళ్లుతుందో తెలియని పరిస్థితి ఎదురైంది. తమ పార్టీనే హ్యాట్రిక్ కొడుతుందని బీఆర్ఎస్ వాళ్లు, తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
కాగా ఆయా పార్టీలు స్పెషల్ విభాగాలను ఏర్పాటుచేసి ఫీల్డ్ లోకి పంపిస్తున్నాయి. తమ పార్టీ భలం ఎంతుంది? ఎన్ని సీట్లు వస్తాయి? ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారు? అనే విషయాలపై రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. వాటి ఆధారంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితిని బట్టి నియోజకవర్గాల్లో దూకుడు పెంచుతూ ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితిని బట్టి సరికొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. చేసిన అభివృద్ధి, తీసుకొస్తున్న హామీలను బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుంటే.. కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రతీ సభలో ప్రత్యర్థిపై సెటైర్లు, కామెంట్లు, కౌంటర్లు ఇస్తూ.. ప్రజలను ఆకర్షిస్తున్నారు. అంతేకాకుండా ఏ పాయింట్స్ పై ఫోకస్ చేసి ప్రత్యర్థిని విమర్శిస్తే బాగుంటుంది అనే అంశంపై కూడా పార్టీలు ఫోకస్ పెట్టాయి. కార్యాచరణ సంగతి ఎలా ఉన్నా రెండు పార్టీలు ప్రజల్లోకి వెళ్లడానికి ఓపెన్ టాక్, వేవ్ లాంటి పరిస్థితిని తీసుకురావడానికి పోటీ పడుతున్నాయి. రానున్న రెండు వారాల్లో పరిస్థితి మరింత మెరుగుపడితే అధికారం దక్కడం ఖాయం అని ధీమాగా ఉన్నారు.