దారుణం.. రెండు నెలల చిన్నారిపై కుక్కల దాడి

Update: 2023-07-30 07:52 GMT

వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిపై దాడి చేశాయి. తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి వచ్చిన కుక్కలు బాబును బయటకు లాక్కెళ్లే ప్రయత్నం చేశాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

మాచారెడ్డి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గుంటి తండాకు చెందిన బానోత్ సురేష్, జ్యోతి దంపతులకు రెండు నెలల క్రితం బాబు పుట్టాడు. శనివారం నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా వీధి కుక్కలు ఇంట్లోకి చొరబడ్డాయి. హాయిగా నిద్రపోతున్న బాబాపై దాడి చేసి తలపై తీవ్రంగా గాయపరిచాయి. చిన్నారిని ఇంట్లోంచి బయటకు లాక్కెళ్లే ప్రయత్నం చేశాయి. బాబు గట్టిగా ఏడవడంతో మేల్కొన్న తల్లిదండ్రులు కుక్కలను తరిమికొట్టారు. ఆలోపే చిన్నారి ముఖం, తలపై కుక్కలు తీవ్ర గాయాలు చేశాయి.

కుక్కల దాడిలో గాయపడిన బాబును తల్లిదండ్రులు వెంటనే కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం బాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్సకు దాదాపు రూ.10లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో సాయం కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. తండాలో వీధి కుక్కలు దాడి చేస్తున్నాయని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తండావాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




Tags:    

Similar News