రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత

Byline :  Kiran
Update: 2024-02-02 06:48 GMT

రాజేంద్రనగర్‌ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ హైకోర్టు నిర్మాణానికి భూమి కేటాయించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. ప్రొఫెసర్లను బయటకు పంపిన విద్యార్థి సంఘాల నాయకులు.. యూనివర్సిటీ గేటుకు తాళం వేసి బైఠాయించారు.

పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఆందోళన చేస్తున్న విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. జీవో 55 రద్దు చేసే వరకు పరీక్షలు నిర్వహించవద్దని నిరసనకారులు హెచ్చరించారు. అప్పటి వరకు తమ నిరసన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.

రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ, ఉద్యాన యూనివర్సిటీలకు చెందిన 100 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం హైకోర్టు నిర్మాణానికి కేటాయిస్తూ గతేడాది డిసెంబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి యూనివర్సిటీ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సదరు భూమిలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించే సమయంలో యూనివర్సిటీ అధికారులకు విషయం తెలిసింది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భూమిని తీసుకోవడంపై ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం హైకోర్టు కొత్త భవన నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయించగా, అందులో ఉద్యాన యూనివర్సిటీకి చెందిన 57.5 ఎకరాలు, వ్యవసాయ వర్సిటీ భూమి 42.5 ఎకరాలు ఉన్నాయి. దీంతో ఆ యూనివర్సిటీలు భూమితో పాటు అందులోని కట్టడాలను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యాన యూనివర్సిటీకి 57.5 ఎకరాల్లో 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టడాలున్నాయి. ఇందులో పలు ఆఫీసులతో పాటు ఇతర కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

వ్యవసాయ సంబంధ వర్సిటీలకు పరిశోధనల కోసం విస్తారమైన భూమి అవసరం ఉంటుంది. వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలకు భూమి లేనిదే పరిశోధనలు చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు యూనివర్సిటీ భూమిని హైకోర్టు నిర్మాణానికి అప్పగించవద్దని ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News