TS EAMCET: కౌన్సెలింగ్‌కు దూరంగా ఎంసెట్ టాపర్లు.. ఎందుకంటే..?

టాప్-200 నుంచి ఒక్క స్టూడెంట్ కూడా లేడు;

Update: 2023-07-10 02:06 GMT


రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో నిర్వహిస్తోన్న ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఈ నెల (వెబ్ ఆప్షన్ల నమోదు) 12 వ తేది వరకు మాత్రమే ఆప్షన్లు ఇవ్వడానికి అవకాశముంది. అయినప్పటికీ టాప్ ర్యాంకులను సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనడం లేదు. టాప్‌-200 ర్యాంకులను సాధించిన వారిలో ఒక్క విద్యార్థి కూడా రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరడానికి ముందుకు రాలేదు. 201-300 ర్యాంకుల్లో ఒకరు.. 301-400 ర్యాంకుల్లో ఇద్దరు.. 401-500 ర్యాంకుల్లో 11 మంది.. ఇలా టాప్‌ వెయ్యి ర్యాంకుల్లో కేవలం 104 మంది మాత్రమే కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. అయితే... సీట్లను కేటాయించిన తర్వాత వీరు కూడా ఇక్కడ కాలేజీల్లో చేరేది కాస్త అనుమానంగా ఉంది.

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీలో భాగంగా కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కౌన్సెలింగ్‌లో భాగంగా దరఖాస్తులను చేసుకోవడం, స్లాట్‌ ఫీజును చెల్లించే గడువు(జులై 8 వ తేదినే) ముగిసింది. ఈ గడువు ముగిసే నాటికి మొత్తం 81,856 మంది విద్యార్థులు స్లాట్‌ ను నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,07,039 ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉండగా.. అందులో కన్వీనర్‌ కోటా పరిధిలో 76,359 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం కౌన్సెలింగ్‌కు 81,856 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. అయితే వీరిలో ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్‌లో పాల్గొన్న వారిలో ... టాప్‌-200 ర్యాంకులను నుంచి ఒక్కరు కూడా లేరు. టాప్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థులు జాతీయ స్థాయిలో జేఈఈ వంటి వాటిల్లో కూడా మంచి ప్రతిభను కనబరిచారు. దీంతో ఆ విద్యార్థులంతా ఎన్‌ఐటీ, ఐఐటీ వంటి సీట్లల్లో చేరుతున్నట్లు సమాచారం. కాగా, స్లాట్‌ను నమోదు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 12వ తేదీలోపు తమ వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఈ నెల 16వ తేదీన వారందరికీ ఇంజనీరింగ్‌ సీట్లను కేటాయించనున్నారు.



Tags:    

Similar News