రాజ్యసభ అభ్యర్థుల వేటలో పార్టీలన్నీ నిమగ్నమయ్యాయి. తెలంగాణ నుంచి 3 రాజ్యసభ స్థానాల భర్తీ కానుండగా.. కాంగ్రెస్ కు రెండు సీట్లు దక్కే అవకాశముంది. దీంతో ఆ పార్టీ తమ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లను ఎంపిక చేసింది. మూడో సీటు బీఆర్ఎస్ కు దక్కే ఛాన్సుంది. అయితే ఆ పార్టీ మాత్రం అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. నామినేషన్ల దాఖలుకు గురువారం ఆఖరి రోజు కావడంతో బీఆర్ఎస్ ఎవరిని బరిలో నిలుపుతుందన్నది ఉత్కంఠగా మారింది.
బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, రావుల చంద్రశేఖర్ రెడ్డిల్లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశమున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వద్దిరాజు, జోగినపల్లి సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్‌ల రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ నెలలో పూర్తికానుంది. వద్దిరాజు కేవలం రెండేళ్లు మాత్రమే ఎంపీగా పనిచేశారు. రాజ్యసభకు ఉప ఎన్నికల్లో రెండేళ్ల క్రితం పెద్దల సభలో అడుగుపెట్టిన ఆయన.. మళ్లీ తనకే ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది టీడీపీని వదిలిపెట్టి గులాబీ కండువా కప్పుకున్న రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఎంపీ సీటు ఆశిస్తున్నారు. ఇటీవలే గులాబీ గూటికి చేరిన నాగం జనార్దన్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు.
పొన్నాల లక్ష్మయ్య, కాసాని జ్ఞానేశ్వర్, దాసోజు శ్రవణ్ తదితరుల పేర్లు కూడా రాజ్యసభ రేసులో బలంగా వినిపిస్తున్నాయి. అయితే పార్టీ గొంతును బలంగా వినిపించే నాయకున్ని పెద్దల సభకు పంపాలని కేసీఆర్ ఆలోచగా తెలుస్తోంది. కుల సమీకరణాలు, ఆర్థిక బలం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వద్దిరాజు బీసీ కావడం ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారింది. రేపటితో నామినేషన్ల గడువు పూర్తికానుండటంతో ఈ రోజు రాత్రి కల్లా నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.