ఏకమవుతున్న బీసీ నేతలు.. టీకాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది..?
రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల్లో మార్పులు, చేర్పులు.. కీలక సమావేశాలు, హామీలు, పలు పథకాలతో రాజకీయం వేడెక్కుతోంది. ఇక టీ కాంగ్రెస్ లో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. రాహుల్ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు నిర్దిష్ట ఎజెండాతో ఒక్కటవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు పోగా మిగిలిన జనరల్ సీట్లలో కనీసం సగం బీసీ అభ్యర్థులకు కేటాయించేలా అధిష్టానంపై ఒత్తిడి తీసుకురానున్నారు. వివిధ సామాజికవర్గాలకు చెందిన బీసీ నేతలంతా ఈ విషయంలో ఒక్కటవుతున్నారు.
47 సీట్లు బీసీలకే.?
ఇతర పార్టీల్లో బీసీలు గెలుస్తున్నప్పుడు కాంగ్రెస్‌లో ఎందుకు ఓడిపోతున్నారని సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలని టీ-కాంగ్రెస్ సీనియర్ నేతలపై బీసీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. అందులో భాగంగానే టీ-కాంగ్రెస్‌లోని బీసీ సీనియర్ నేతలందరినీ కలిసి చర్చిస్తున్నారు కొందరు నాయకులు. మాజీ మంత్రి పొన్నాలను కలసిన బీసీ నేతలు.. పార్టీలో అన్ని స్థాయిల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చేలా చొరవ చూపాలని కోరారు. రాష్ట్రంలోని మొత్తం జనరల్ నియోజకవర్గాల్లో 47 సీట్లను బీసీలకు ఇచ్చేలా పట్టుబట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హైకమాండ్‌కు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు.
బీసీలపైనే పార్టీల కన్ను
ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు బీసీ ఓటు బ్యాంకు మీద కన్నేశాయి. బండి సంజయ్ నుంచి బీజేపీ చీఫ్ పదవి కిషన్‌రెడ్డికి షిఫ్ట్ కావడంతో ఇప్పుడు బీసీల ఓటు బ్యాంకును అనుకూలంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ వ్యూహం పన్నినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే కులవృత్తుల బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయంతో వారికి చేరువ కావడానికి ఇప్పటికే రోడ్ మ్యాప్ తయారైంది. ఈ నెల 15 నుంచి లాంఛనంగా ఈ స్కీమ్ పట్టాలెక్కుతున్నది. దీంతో కాంగ్రెస్ నాయకులు కూడా బీసీలను ఆకర్షించాలనే భావనతో పార్టీపైన ఒత్తిడి తీసుకొచ్చి గణనీయంగా టికెట్లు పొందాలనుకుంటున్నారు.
బీసీ డిక్లరేషన్..
కాంగ్రెస్ పార్టీ బీసీలకు దగ్గర కావడం కోసం బీసీ డిక్లరేషన్‌ను పెట్టాలనుకుంటున్నది. ఇందుకోసం ప్రాథమిక కసరత్తు ఇప్పటికే మొదలైంది. రానున్న రోజుల్లో బీసీ అగ్రనేత చేతుల మీదుగా ఈ డిక్లరేషన్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నది. ఇదే సమయంలో పార్టీలోని బీసీ నేతల్లో కూడా వీలైనన్ని ఎక్కువ టికెట్లను దక్కించుకునేలా ఒకే రాగం అందుకోనున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఓకే ఒక బీసీ ఎమ్మెల్యే గెలిచారు. దీంతో బీసీలు కాంగ్రెస్‌కు మద్దతుగా లేరనే విషయాన్ని గుర్తించిన అదిష్టానం బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కనీసం ఇద్దరు బీసీలకు టికెట్ ఇవ్వాలనేది బీసీ నేతల డిమాండ్. అది కూడా ఫస్ట్ లిస్ట్‌లోనే ఫైనల్ చేయాలని కోరుతున్నారు. మరి బీసీ నేతల డిమాండ్‌కు అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.