తెలంగాణలో తబ్రీద్ భారీ పెట్టుబడి..

Byline :  Krishna
Update: 2023-09-06 11:57 GMT

ప్రపంచ ప్రఖ్యాత కూలింగ్ సంస్థ తబ్రీడ్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ తెలంగాణలోని పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో భాగంగా చేపట్టే కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం దాదాపు 1600 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడితో పారిశ్రామిక పార్కులకు కూలింగ్ వసతులను అందించనుంది. ఈ మేరకు తబ్రీద్ సంస్థతో తెలంగాణ సర్కార్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

హైదరాబాద్ ఫార్మసిటీతో పాటు రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక పార్కుల అవసరాల కోసం ఈ కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తబ్రీద్ అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు సంస్థ లక్షా 25 వేల రిఫ్రిజిరేషన్ టన్నుల కూలింగ్ వసతులను తెలంగాణలో అభివృద్ధి చేస్తుంది. దీని వలన 24 మిలియన్ టన్నుల కార్బన్ డై యాక్సైడ్ ఉద్గారాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఈ లక్ష్యం పూర్తైతే ఆసియా ఖండంలోనే జీవించేందుకు, పని చేసేందుకు అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవనుంది.

ఈ ఒప్పందం వల్ల దాదాపు 6800 గిగా వాట్ల కరెంటుతో పాటు 41,600 మెగా లీటర్ల నీటిని పారిశ్రామిక రంగంలో పొదుపు చేసేందుకు అవకాశం కలుగుతుంది. దీంతోపాటు 6.2 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను అరికట్టేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం ఈ సంస్థతో కలిసి చేపడుతున్న ఈ మౌలిక వసతుల కల్పన వలన ముఖ్యంగా ఫార్మా రంగంలో ఉన్న బల్క్ డ్రగ్ తయారీ కేంద్రాలకు స్వచ్ఛమైన పరిష్కారాలు లభించే అవకాశం ఏర్పడుతుంది.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైబరాబాద్ వంటి కమర్షియల్ డిస్ట్రిక్ట్తో పాటు పలు ప్రాంతాల్లో 2 మెగావాట్ల మేర విద్యుత్ డిమాండ్తో పాటు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో ఈ ఒప్పందం ఎంతో కీలకం కానుంది. దీంతో సుదీర్ఘకాలంలో హైదరాబాద్లో కాలుష్యం, ఉష్ణోగ్రతలు తగ్గి అత్యుత్తమ నగరానికి కావాల్సిన అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News