Tammineni health update: తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బుటిటెన్ విడుదల.. డాక్టర్లు ఏమన్నారంటే?
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. నిన్న ఖమ్మం నివాసంలో ఉండగా గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కు తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. తాజాగా తమ్మినేనికి ట్రీట్మెంట్ అందిస్తున్న వైద్యులు హెల్త్ అప్ డేట్ ఇచ్చారు. ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఆయనకు మందులతో చికిత్స అందిస్తున్నామని, బీపీని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆయన ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని, దాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం తమ్మినేని పరిస్థితి విషమంగానే ఉందని, మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రత్యేక డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ కొనసాగుతుందని అన్నారు.
గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న తమ్మినేనికి నిన్న మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. కాగా తమ్మినేని మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ప్రకటించారు.