40 ఏళ్లుగా కాంగ్రెస్, 9 ఏళ్లుగా BRS... ప్రజలకు చేసిందేమి లేదు.. తమ్మినేని
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఊసరవెల్లి రాజకీయాలు నడుస్తున్నాయన్నారు సీపీఎం నేత, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని వీరభద్రం. డబ్బుల సంచులతో రాజకీయం నడుస్తోందన్నారు. సోమవారం నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం మూటపురం, రాజేశ్వరపురం, శంకర్‌గిరి తండా, చెన్నారం గ్రామాల్లో తమ్మినేని వీరభద్రం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారంలో మాట్లాడుతూ.. శాసనసభలో మాట్లాడలేని వ్యక్తులకు ఓటు వేయడం ఉపయోగం ఉండదన్నారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ, తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమి లేదన్నారు. ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇవ్వాలన్నారు.
చట్టసభల్లో కమ్యూనిస్టులకు ప్రాధాన్యం ఉండాలని, అప్పుడే ప్రజా గొంతుక సభలో వినబడుతుందని అన్నారు. ఇక అంతకుముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు భూర్జువా స్వభావం కలిగి ఉన్నవేనని కామెంట్స్ చేశారు తమ్మినేని. బీఆర్ఎస్ ది అహంకార ధోరణి.. కుటుంబ పాలనతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది.. కేసీఆర్, కమ్యూనిస్టులను పక్కన పెట్టి తప్పుడు ప్రచారం చేశారు అని పేర్కొన్నారు.