తెలంగాణకు మరో కంపెనీ.. రూ.225 కోట్ల పెట్టుబడితో టీసీఎల్‌ ప్లాంట్‌

Update: 2023-06-29 05:16 GMT

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ టీసీఎల్.. తెలంగాణలో రూ.225 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ పెడుతున్నది. రాష్ట్రానికి చెందిన రిసోజెట్‌ సంస్థతో కలిసి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నది. ఈ యూనిట్‌తో సుమారు 500 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించనుంది. బుధవారం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో రిసోజెట్‌తో టీసీఎల్ సంస్థ ప్రతినిధులు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కేటీఆర్ సమక్షంలో రిసోజెట్‌, టీసీఎల్‌ సంస్థల ప్రతినిధులు సంతకాలు చేసినట్టు బుధవారం ఆ కంపెనీలు తెలిపాయి. రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాల్‌ వద్దనున్న ఈ-సిటీలో ఈ స్టేట్‌-ఆఫ్‌-ది-ఆర్ట్‌ కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ యూనిట్‌ రానున్నది.

చైనాలోని హెఫెయి నగరం తర్వాత టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ విదేశంలో ఏర్పాటు చేస్తున్న తొలి తయారీ యూనిట్ ఇదే. రంగారెడ్డిలోని రావిర్యాల్ లో ఉన్న ఈ- సిటీలో తొలుత వాషింగ్ మెషిన్లను తయారు చేసేందుకు కేంద్రంను ఏర్పాటు చేసి భవిష్యత్తులో రిఫ్రిజిరేటర్లు, డిష్ వాషర్లను కూడా ఉత్పత్తి చేసేందుకు సంస్థను విస్తరించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టీసీఎల్ కంపెనీని స్వాగతిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, రాష్ట్రం నుంచి హైటెక్నాలజీ ఉత్పత్తుల తయారీకి అవకాశం ఉన్నదన్నారు. రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీకి అత్యంత అనువైన ప్రాంతమని, టీసీఎల్ కంపెనీ తెలంగాణలో తమ ఉత్పత్తులను తయారు చేసేందుకు ముందుకు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. టీసీఎల్ తయారీ యూనిట్‌కు అవసరమైన అన్ని రకాల సహకారం రాష్ట్రం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని మరో షెన్జన్(గ్లోబల్‌ టెక్నాలజీ హబ్‌, చైనా సిలికాన్‌ వ్యాలీ) ఆఫ్ ఇండియా‌గా మార్చేందుకు సిద్ధంగా ఉన్నదని, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలను, టీసీఎల్ సంస్థ చైర్మన్ జువాన్ డూకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. ఒప్పందం కుదుర్చుకున్న రిసోజెట్ కంపెనీ ఎండీ రమీందర్ సింగ్ సోయిన్, టీసీఎల్ ప్రతినిధులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజాయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News