తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ.. పొత్తుపై తేల్చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ విపక్షం టీడీపీ తెలంగాణ ఎన్నికల్లోనూ అదృష్టం పరీక్షించుకోనుంది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోయినా ఈసారి కూడా మళ్లీ బరిలోకి దిగుతోంది. బీజేపీతో కలసి పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ అధితనే చంద్రబాబు వీటికి తెరదింపారు. తెలంగాణలో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ‘రాజకీయ వ్యవహారాల’ కోసం హస్తిన వెళ్లిన ఆయన విలేకర్లతో మాట్లాడారు.
తెలంగాణలో టీడీపీ మొత్తం 119 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని బాబు చెప్పారు. ‘‘టికెట్లు ఇవ్వడానికి ఓ కమిటీని కూడా వేశాం. అభ్యర్థుల దరఖాస్తులు పరిశీలిస్తాం. బీజేపీతో పొత్తుకు సమయం మించిపోయింది. ఒంటరిగానే పోటీ చేస్తాం’’ అని చెప్పారు. జగన్ ప్రభుత్వం ఏపీని సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. ఏపీలో బీజేపీతో పొత్తుపై స్పందిస్తూ దేశ సంక్షేమం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘‘గతంలో ఎన్డీయే నుంచి బయటికి రావడానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమే కారణం. ఇప్పుడు బీజేపీతో ఏం చర్చిస్తున్నామో చెప్పలేను. మోదీ అధికారంలోకి వచ్చాక దేశానికి ఖ్యాతి పెరిగింది. నాశనమైన ఏపీని తిరిగి అభివృద్ధి బాట పట్టించాన్నదే నా లక్ష్యం’’ అని చెప్పారు.