అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణపై విషం చిమ్మే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. కేసీఆర్ పాలన బాగుందంటూ కితాబిచ్చారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎంతో బాగుపడ్డారని, భూముల రేట్లు కూడా బాగా పెరిగాయని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఒత్తిడి తెస్తున్నా కేసీఆర్ మాత్రం రైతులపక్షాన నిలిచారని చంద్రబాబు ప్రశంసించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ సర్కారు తెగ పొగిడేశారు.
కేసీఆర్ నిర్ణయాలపై ప్రశంస
ఒకప్పుడు వ్యవసాయం దండగన్న చంద్రబాబు నేడు తెలంగాణలో సాగు పండగలా మారిందని చెప్పారు. రైతుల విషయంలో రాష్ట్రసర్కారు అవలంబిస్తున్న విధానాలను ప్రశంసించారు. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదని, రైతులపై ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్న ప్రభుత్వమే అలాంటి నిర్ణయాలు తీసుకొంటుందని బాబు కితాబిచ్చారు. తెలంగాణలో వ్యవసాయం, భూముల ధరలను ఏపీతో పోల్చి చూపుతూ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని, రైతులను ప్రేమిస్తోందని, రాష్ట్రం అన్నిరంగాల్లోనూ ఎంతో అభివృద్ధి సాధించిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ రాష్ట్రంలో అయితే అభివృద్ధి జరుగుతుందో అక్కడ భూముల విలువ పెరుగుతుందని అందుకు తెలంగాణే ఉదాహరణ అని చెప్పారు. సాగునీరు అందుబాటులో ఉంటే సాగు విస్తీర్ణంతో పాటు భూమి విలువ కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. పరిశ్రమలు, రోడ్లు వస్తే వాటి విలువ మరింత పెరుగుతుందన్న ఆయన.. రైతులు వ్యవసాయంలో నష్టపోయినా.. భూమిని అమ్ముకొని కష్టాల నుంచి గట్టెక్కుతారని చెప్పారు.
ఒకరా అమ్మి 100 ఎకరాలు
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతులు ఎకరా అమ్మి హైదరాబాద్‌లో నాలుగైదు ఎకరాలు కొనేవారని కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయిందని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక ఎకరా అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఏపీతో పోలిస్తే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్న ఆయన అందుకే రాష్ట్రంలో భూముల విలువ పెరిగింది అని అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణలో భూముల విలువ వ్యత్యాసాన్ని పోల్చిచూపుతూ.. నెల రోజు క్రితం కూడా చంద్రబాబు ఇలాంటి కామెంట్లు చేయడం విశేషం.
కేంద్రం బెదిరింపులకు లొంగని కేసీఆర్
నిజానికి రైతుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి ఎదురునిలిచి మరీ పోరాడుతోంది. సంస్కరణల పేరుతో కుట్రలకు తెరలేపిన మోడీ సర్కారు వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్రాలపై తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది. అందుకు అంగీకరించని రాష్ట్రాలన బెిరించి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణపైనా ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ సర్కారు మాత్రం కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు బెదరలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. దీంతో కక్షగట్టిన మోదీ సర్కారు రాష్ట్రాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది. అయినా రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్రంపై పోరాడుతోంది. తాజాగా తెలంగాణకు బద్ద శత్రువైన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రైతులపై కేసీఆర్ ప్రభుత్వ ప్రేమకు, చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయని పలువురు అంటున్నారు.
హైదరాబాద్‌లో ఒక ఎకరా అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చింది
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2023
అభివృద్ధి జరిగితే, ఇరిగేషన్ పెరిగితే, ఇండస్ట్రీలు వస్తే, రోడ్డు వేస్తే నమ్మకం ఆశతో ఆ భూములు విలువ పెరుగుతుంది. ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరం అమ్మి హైదరాబాద్‌లో 4 ఎకరాలు కొనే వారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక ఎకరా… pic.twitter.com/O9r5s0Q5Yr