కేసీఆర్‌పై వెయ్యి నామినేషన్లు వేస్తాం.. నిరుద్యోగుల హెచ్చరిక..

Byline :  Lenin
Update: 2023-08-30 08:49 GMT

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం ఖాళీగా ఉన్న 13వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖలో రిటైరై వారి ఖాళీలు 10 వేల పోస్టులను కలిపి అన్నిటికీ ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆందోళన చేస్తున్నారు. లేకపోతే సీఎం కేసీఆర్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

డిమాండ్ సాధనలో భాగంగా మంగళవారం డీఎస్, బీఎడ్ అభ్యర్థులు రాష్ట్ర విద్యాశాఖను ముట్టడించారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. బషీర్‌బాగ్‌ నుంచి అసెంబ్లీ వైపునకు దూసుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించగా లాఠీ చార్జ్ చేశారు. 13వేల పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వం కేవలం 5వేల పోస్టులను భర్తే చేస్తామని చెప్పడం సరికాదని ఆందోళనకారులు మండిపడ్డారు. అన్ని పోస్టులను భర్తీ చేయకపోతే సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో పోటీగా వెయ్యి నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కల్వకుంట్ల కవితకు పోటీగా వందల మంది పసుపు రైతులు నామినేషన్లు వేసినట్లు వేస్తామని చెప్పారు. ఒక్కో అభ్యర్థి నామినేషన్‌కు రూ. 10 వేలు ఖర్చయినా అందరం కలసి భరించి ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు.

Tags:    

Similar News