స్వల్పకాలిక వరి రకాలనే పండించండి..మంత్రి నిరంజన్ రెడ్డి

Update: 2023-06-25 05:02 GMT

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. జిల్లాల్లో జల్లులు పడుతుండటంతో రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. సాగుకు అవసరమైన పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. అయితే ఈ సీజన్‎లో రైతులు స్వల్పకాలిక వరి వంగడాలనే సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. ఈ మేరకు రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సెక్రటేరియట్‎లో శనివారం వానాకాలం సాగుపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో క్షేత్రస్థాయిలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో పంటల సాగు, విత్తనాల లభ్యత, ఎరువుల సరఫరాపై ఆయా శాఖల అధికారులను మంత్రి ఆరా తీశారు. అదే విధంగా రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఓ వీడియో మెసేజ్‎ను మంత్రి రిలీజ్ చేశారు.


సమీక్షలో మంత్రి మాట్లాడుతూ..." జులై రెండో వారం నుంచి ఆగస్టు చివరి వరకు సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సాగుపై సలహాలు, సూచనలు ఇవ్వాలి. ముఖ్యంగా వరిలో దీర్ఘకాలిక రకాలకు బదులు స్వల్పకాలిక రకాలను సాగుకు ఎన్నకోవాలని ప్రోత్సహించండి. కూనారం సన్నాలు, కూనారం 1638, బతుకమ్మ, వరంగల్‌ 962, ఆర్‌ఎన్‌ఆర్‌ 21278, ఆర్‌ఎన్‌ఆర్‌ 29325, జగిత్యాల 1798, తెలంగాణ సోనా, ఎంటీయూ 1010, జగిత్యాల 24423, ఐఆర్‌ 64, హెచ్‌ఎంటీ సోనా వంటి స్వల్పకాలిక వరి రకాలను సాగు చేయించాలి. వానాకాలం సాగు అవసరమైన అన్ని రకాల ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైనా విత్తనాల కొరత సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆరుతడి పంటలు పండించే రైతులు బోదెల పద్ధతిని అనుసరించాలి. ఈ ఏడాది 2 లక్షల ఎకరాల్లో పామాయిల్ పంటను సాగు చేయించాలన్నది లక్ష్యం. ఇప్పటికే 60 వేల ఎకరాలలో ఆయిల్‎పామ్ సాగుకు రైతులు ముందుకొచ్చారు. యాసంగి పంట కాలాన్ని ముందుకు జరిపేలా అధికారులు ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలి" అని మంత్రి అధికారులకు తెలిపారు. 

Tags:    

Similar News