CM Revanth reddy: సమగ్ర కుటుంబ సర్వే వివరాలెక్కడ?.. అసెంబ్లీలో రేవంత్ ప్రశ్న
కుల గణన తీర్మానం ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీ కులగణనపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ .. కేంద్రం పరిధిలోని కులగణన అంశంపై రాష్ట్రం ఎలా చట్టం చేస్తుందన్న వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలపై ఇంటింటి సర్వే చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. వెనుకబడిన వర్గాల సమాచారాన్ని సర్వే ద్వారా సేకరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే వివరాలను బహిర్గతం చేయలేదని వెల్లడించారు. ఆ సమాచారాన్ని ఒక కుటుంబం తన దగ్గర దాచుకుందని కీలక వ్యాఖ్యలు చేశారు
ఎలాంటి అనుమానాలకు తావులేకుండా తాము కులగణన తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పారు. దీనిని కూడా ప్రతిపక్షం చర్చను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. తాను ప్రతిపక్ష నాయకులకు ఒక సలహా ఇస్తున్నాను.. దీనిపై ఎవరికి అనుమానం ఉన్నా నిర్భయంగా ప్రస్తావించొచ్చని.. ప్రభుత్వానికి ఏవైనా సూచనలు చేయాలనుకున్నా చేయొచ్చని తెలిపారు. ప్రతిపక్షం ఇచ్చే సహేతుకమైన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరారు.
కులగణన అంశంపై మాజీ మంత్రి గంగుల కమలాకర్.. బీసీ కులగణనపై తీర్మానం కాదు.. చట్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు కులగణన చేస్తే.. బీసీ కులాలే నష్టపోతాయన్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చట్టం చేయాలన్నారు. కులగణన ఏ విధంగా చేస్తారో ముందే స్పష్టం చేయాలన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించిపోతే ఏం చేస్తారని ప్రభుత్వాన్ని గంగుల ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు బదులుగా రేవంత్ రెడ్డి.. గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే బయటపెట్టారా? అని ప్రశ్నించారు. మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని పొన్నం ప్రభాకర్ తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. ప్రజలకు కొన్ని అనుమానాలు వచ్చే విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని, చర్చను ప్రతిపక్షం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఎవరైనా సూచనలు ఇస్తే వాటిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు.