CM Revanth Reddy : మ్యాన్ మేడ్ ప్రాజెక్టు గురించి కేసీఆర్ వివరించాలి.. సీఎం రేవంత్ రెడ్డి

Update: 2024-02-13 05:51 GMT

మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై సెటైర్లు వేశారు. ఇసుక కుంగడం వల్ల ప్రాజెక్టు కుంగిందని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని.. ఇసుకపై పేక మేడలు కట్టారా అని సెటైర్లు వేశారు. కుంగిపోయిన ప్రాజెక్టును చాన్నాళ్లు ఎవరూ చూడకుండా చేశారన్నారు. వాఘా బార్డర్‌లో లేని విధంగా ప్రాజెక్టుల వద్ద పోలీసుల పహారా పెట్టారని ఫైర్ అయ్యారు. రూ.35 కోట్ల అంచనాతో ప్రారంభించిన ప్రాజెక్టును రూ.లక్షా 47వేల కోట్లకు పెంచారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతమని అమెరికాలోనూ ప్రచారం చేశారన్నారు. కాళేశ్వరం మీకు ఏటీఎంలా మారిందని.. మీ ఇళ్లలో కనకవర్షం కురిసిందని తాము అనడం లేదన్నారు.

ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలనే మేడిగడ్డ పర్యటనకు పిలుపునిచ్చామన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మేడిగడ్డ పర్యటనకు రావాలన్నారు. బస్సులు రావడం ఇబ్బందిగా అనిపిస్తే హెలికాప్టర్‌ కూడా సిద్ధం చేస్తామని కేసీఆర్ నుద్దేశించి అన్నారు. మ్యాన్ మేడ్ ప్రాజెక్టు గురించి కేసీఆర్ వచ్చి వివరిస్తేనే బాగుంటుందన్నారు. కాళేశ్వరరావు(హారీష్ రావు) కూడా రావాలన్నారు.

సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అని పెద్దలు చెప్పారన్నారు రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుల వల్లే కరవు ప్రాంతాల్లోనూ పంటలు పండించే అవకాశం వచ్చిందన్నారు. ప్రాజెక్టు రీ డిజైన్ అనే బ్రహ్మపదార్థాన్ని కనిపెట్టి అంచనాలను బీఆర్ఎస్ సర్కారు పెంచిందన్నారు. రేపో ఏల్లుండో మేడిగడ్డపై అసెంబ్లీలో చర్చిస్తామని.. త్వరలో శ్వేతపత్రం కూడా విడుదల చేస్తామన్నారు. కాగా కాసేపటి క్రితం మేడిగడ్డ సందర్శనకు 4 బస్సుల్లో బయలుదేరారు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.   




Tags:    

Similar News