Telangana Election Counting: తెలంగాణ ఎన్నికలు.. ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో తేలనున్నాయి. ఈవీఎంలలో(EVM) నిక్షిప్తం చేసిన రెండు కోట్లా 32 లక్షలకు పైగా ఓటర్ల తీర్పు మరికొంత సమయంలో వెలువడనుంది. గత నెల 30న 119 నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తి కావడంతో నేడు ఎన్నికల అధికారులు ఈవీఎంలను ఓపెన్ చేసి ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు మాక్ కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత 8 గంటల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఈవీఎమ్లలోని ఓట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతీ నియోకవర్గానికి 14 టేబుళ్లను మొత్తం 1,766 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు నలుగురు సిబ్బందిని కేటాయించారు. ప్రతి అరగంట నుంచి 45 నిమిషాల వ్యవధిలో ఒక్కో రౌండ్రిజల్ట్ వెలువడే అవకాశం ఉంది. కౌంటింగ్ సమయంలో అనుమతి పొందిన వారికే ప్రవేశముంటుందని, పరిసరాలన్నీ మూడంచెల భద్రతతో కట్టుదిట్టంగా ఉంటాయని అధికారులు తెలిపారు.
ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 2290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 2068 మంది పురుషులు, 221 మంది మహిళలు కాగా ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. బీఆర్ఎస్ మొత్తం 119 స్థానాల్లో పోటీలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థులు 118 చోట్ల బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు 111 స్థానాల్లో పోటీలో నిలవగా, మిత్రపక్షం జనసేన(Janasena Party) 8 స్థానాల్లో పోటీ చేసింది. సీపీఎం 19, సీపీఐ ఒక స్థానంలో, బీఎస్పీ నుంచి 108 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇతర పార్టీలు, స్వతంత్రులు ఈ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పోటీలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీనగర్లో 48 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, అత్యల్పంగా నారాయణపేట, బాన్స్ వాడలో కేవలం 7 గురు అభ్యర్థులు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారు. ఉదయం 10 గంటల తర్వాత భద్రాచలం(తొలి ఫలితం) వెలవడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.