Telangana Assembly : నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఆఖరి రోజైన నేడు సభలో కులగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఉదయం 10 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం కులగణనకు ఆమోద ముద్ర వేసింది. జనాభాలో ఏ సామాజిక వర్గం, ఎంత శాతం ఉందో తేల్చేందుకు కులగణన చేపట్టాలనేది ఈ తీర్మానం ఉద్దేశం. ఇప్పటికే ఈ తీర్మానంపై అధికార, ప్రతిపక్షాలతో స్పీకర్ చర్చించారు. నిజానికి కుల జనగణన తీర్మానం నిన్న గురువారం సభలో పెట్టాలని సర్కార్ భావించింది. అయితే ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఆలస్యం అవడంతో కులగణన తీర్మానం నేటికి వాయిదా వేసుకున్నారు.
ఆ తర్వాత నీటిపారుదల శాఖపై శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రాన్ని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) విడుదల చేయనున్నారు. 2014 నుంచి 2023దాకా చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ ప్రధానంగా శ్వేతపత్రంలో పేర్కొననున్నారు. ప్రాజెక్టుల వారీగా వ్యయం, కొత్త ఆయకట్టు వంటి అంశాలే ప్రముఖంగా శ్వేతపత్రంలో ఉండనున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మధ్యంతర నివేదిక, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చోటుచేసుకున్న వైఫల్యాలు ఇందులో పొందుపరచనున్నారు. దేశవ్యాప్తంగా బ్యారేజీల సామర్థ్యం, ఆయా బ్యారేజీల కింద సాగు విస్తీర్ణంపాటు మేడిగడ్డ వైఫల్యానికి కారణమైన నీటి నిల్వ సామర్థ్యం ప్రధానంగా ప్రస్తావించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక సారాంశం కూడా శ్వేతపత్రంలో ఉండనుంది.