తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహర్తం ఖరారైంది. ఆగస్టు 3 నుంచి శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జులై 31 మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
కేబినెట్ భేటీలో దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినెట్ చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కేబినెట్ సమీక్ష నిర్వహించనుంది. రాష్ట్రంలో వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న సమయంలో అకాల వర్షాలతో వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేయనున్నారు. అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపు తదితర అంశాలపై చర్చించి కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.