ఈటల పనేమిటి? ఎన్నికల నిర్వహణ కమిటీ ఏం చేస్తుంది?

Update: 2023-07-04 17:06 GMT

తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎన్నికవడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలి నుంచీ పార్టీలో ఉన్న వారిని కాదని మొన్న వచ్చిన ఈటలకు ఇంత కీలక పదవి అప్పగించడంపై విమర్శలూ వస్తున్నాయి. అయితే ఎన్నికల సమరంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనపై నమ్మకంతోనే అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. అందర్నీ కలుపుకుపోయి సైనికుడిలా పనిచేస్తానని ఈటల ఆ పదవి తనకు దక్కకముందే చెప్పి అందరి వాడనని ఆయన సంకేతాలు పంపారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఎన్నికల కమిటీ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేతలకు, శ్రేణుల మధ్య సమన్వయంతో ప్రచారాన్ని బలంగా నిర్వహించడానికి ఈ కమిటీని వేశారు. కమిటీలో సభ్యులుగా ఎవరెవరు ఉంటారో త్వరలోనే ప్రకటించే అవకాశముంది..

నిర్వహణ భారమంతా..

పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీనే క్లుప్తంగా ఎన్నికల కమిటీ అంటుంటారు. బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీలతోపాటు పలు ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నికల భారాన్ని తలా ఇంత పంచుకోవడానికి నానా పేర్లతో కమిటీలు వేస్తుంటాయి. ఎన్నికల కమిటీ.. దాని పేరులోనే ఉన్నట్లు పార్టీ తరఫున ఎన్నికల వ్యవహరాలన్నీ పూర్తి చేస్తుంది. అభ్యర్థుల ఎంపిక, ధనబలం, కండబలం వంటివి రాష్ట్ర అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు ఢిల్లీ అధిష్టానంతో కలిసి చూసుకుంటే ఎన్నికల కమిటీ ప్రచారాన్ని తన నెత్తిన వేసుకుంటుంది.

స్థూలంగా ఎన్నికల కమిటీ బాధ్యతలు ఇవీ..

1. ఎన్నికల మేనిఫెస్టో తయారీ: ప్రజాకర్షక హామీలతో ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ప్రధాన ప్రత్యర్థి పార్టీ వైఫల్యాలను దుయ్యబడుతూ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలు నమ్మేలా చెప్పగలిగాలి. కొన్ని పార్టీలు ఎన్నికల మేనిఫేస్టో తయారీ కోసం విడిగా కమిటీ వేస్తుంటాయి. అయితే ఎన్నికల నిర్వహణ కమిటీ సూచించే అంశాలకు ప్రధాన్యత ఇస్తాయి.

2. ప్రచారం: పార్టీ అభ్యుర్థుల తరపున విస్తృతంగా ప్రాచారం చేయాలి. సభలు, యాత్రలు, ప్రజలను కలవడం వంటి ఎన్నో రూపాల్లో పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేర్చాలి. ఎన్నికల నిధులు, సామగ్రి సరఫరా, విరాళాల సేకరణ, సోషల్ మీడియా ప్రచారం, జాతీయ నాయకులను ప్రచారానికి పిలవడం వంటి ఎర్పాట్లన్నీ చేయాలి.

3. సమన్వయం: పార్టీకి చెందిన రాజకీయ వ్యవహారాల కమిటీ, ఆర్థిక వ్యవహాల కమిటీ వంటి అనేకానేక కమిటీలను సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని సాగించాలి. లోటుపాట్లు గుర్తించి పరిష్కరించుకోవాలి. సహకరించని నేతలపై అధిష్టానికి ఫిర్యాదు చేయడం వంటి అంతర్గత క్రమిశిక్షణ పద్ధతులను అనసరించాలి. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా శక్తివంచన లేకుండా పనిచేయాలి.

Tags:    

Similar News