Bjp MP Candidates : గెలుపు గుర్రాల వేటలో బీజేపీ.. 16లోపు అభ్యర్థుల ప్రకటన..?

Byline :  Kiran
Update: 2024-02-08 07:39 GMT

సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజుల్లో నోటిఫికేషన్ జారీకానున్న నేపథ్యంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. గెలుపు గుర్రాలను వెతికే పనిలో నిమగ్నమయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తున్న బీజేపీ మిగతా పార్టీల కన్నా ముందు అభ్యర్థుల్ని ప్రకటించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎన్నికల కమిటీ ఢిల్లీలో భేటీ అయింది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తోంది.

ఈ నెల 16లోపు ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో మెజార్టీ సీట్లలో బరిలో దింపే అభ్యర్థుల పేర్లు మొదటి జాబితాలోనే ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎలక్షన్ కమిటీ ఇప్పటికే కొందరు అభ్యర్థుల్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వారిలో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి కిషన్‌ రెడ్డి, కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌, నిజామాబాద్‌ బరిలో ధర్మపురి అరవింద్‌, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి,

భువనగిరి స్థానం నుంచి బూర నర్సయ్య గౌడ్‌, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి డీకే అరుణ అభ్యర్థిత్వాలను దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.

ఇక పెద్దపల్లి, మహబూబాబాద్‌, నాగర్‌ కర్నూలు, వరంగల్‌, జహీరాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్లగొండ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక అత్యధిక డిమాండ్ ఉన్న మల్కాజ్గిరితో పాటు మెదక్‌, హైదరాబాద్‌ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కేంద్ర ఎన్నికల కమిటీకే వదిలేసినట్లు సమాచారం.

Tags:    

Similar News