కాళేశ్వరం అవినీతిపై ఎందుకు చర్చించలేదు : బీజేపీ ఎమ్మెల్యేలు
రేవంత్ రెడ్డి సర్కార్ రిలీజ్ చేసిన శ్వేత పత్రాల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులపై స్పష్టత లేదని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టుపై శాసనసభలో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టిన నిజాలు బయటకు రావన్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర సర్కార్ కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు. కాళేశ్వరం అవినీతికి సంబంధించి ఆధారాలు తమవద్ద ఉన్నాయని గతంలో కాంగ్రెస్ చెప్పిందని.. ఇప్పుడు వారి ప్రభుత్వమే ఉంది కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని మాత్రమే అమలు చేశారని.. మిగితా వాటిని ఎప్పుడు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు దగా పడ్డారన్నారు. యువతకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలన్నారు. మెగా డీఎస్సీతో పాటు 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పారు. అన్ని పార్టీలతో పాటు అధికారులతో ఓ కమిటీ వేసి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకారం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.