Kishan Reddy : పీఎం అభ్యర్థి ఎవరో వారికే తెలియదు.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి సెటైర్లు

Byline :  Veerendra Prasad
Update: 2024-02-21 06:40 GMT

తెలంగాణలో రెండో రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం నారాయణ పేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొనసాగుతున్న ఈ యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నారాయణ పేట పట్టణంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు రావని చెప్పారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ఆరు గారడీలు చేసిందన్నారు. ఆరు గ్యారంటీలు ఎప్పటి నుంచి అమలులోకి తీసుకొస్తారని ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 ఎప్పటి నుంచి ఇస్తారన్నారు. ఆరు గ్యారెంటీలు అయ్యేది కాదు.. పోయేది కాదని ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారో ప్రజలకు చెప్పారా?.. ఆరు గ్యారెంటీలను ఎప్పటి నుంచి.. ఏ రకంగా అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రజల దృష్టిని మళ్లించేందుకే బిఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఛార్జిషీట్ ప్రకటించింది. ఛార్జిషీట్ల ఆధారంగా కేసులు ఎందుకు నమోదు చేయలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఛార్జిషీట్ నిజమైతే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు ఎందులు లేవు ? అని ఆయన ఆడిగారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒకటే.. రెండు కుటుంబ పార్టీలేనని కిషన్ రెడ్డి తెలిపారు.

మూడోసారి మోదీ ప్రధాని అవుతారని.. ఆయనను ఎవరూ ఆపలేరన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల గెలుపుతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేమి ఉండదని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉందన్నారు. కాంగ్రెస్ పీఎం అభ్యర్థి ఎవరో వారికే తెలియదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

Tags:    

Similar News