తెలంగాణలో నయా నిజాం, దళితులకు వెన్నుపోటు.. కిషన్ రెడ్డి

Update: 2023-07-06 14:20 GMT

ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక్క కుటుంబం చేతిలో బందీ అయిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం వస్తే తమ ఆకాంక్షలు నెరవేరతాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గురువారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలసి విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో నయా నిజం పాలనను తలపిస్తున్న కేసీఆర్ కుటుంబ పాలనను, అవినీతిని నిర్మూలించడమేనని బీజేపీ లక్ష్యమని కిషన్ రెడ్డి చెప్పారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్‌హౌస్ దాటి బయటికి రానివ్వకూడదని అన్నారు.

‘‘దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ వారికి వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కారు. గిరిజన బంధు పేరుతో ఉత్తుత్తి ప్రచారం చేసుకుంన్నారు. రైతులకు ఉచిత ఎరువుల హామీ ఊసేలేదు. ప్రతి మండల కేంద్రంలో ఆస్పత్రులు నిర్మిస్తామని మోసం చేశారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ ఎక్కడ అమలైందో చెప్పాలి? బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూములు కేటాయించుకుంటూ ప్రజలకు మొండిచేయి చూపుతున్నారు. అభివృద్ధి పనులు ఆగడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరించకపోవడమే కారణం ’’ అని బీజేపీ నేత మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ తోడు దొంగలని కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీకీ ఓటేసే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టే. ఆ పార్టీలు గతంలో పొత్తుపెట్టుకున్నాయి, ఒప్పందాలు చేసుకున్నాయి. వాటి డీఎన్ఏ ఒక్కటే. తప్పు వాళ్లు ఇప్పు మమ్మల్ని ఏదో ఎంటున్నారు.. ఆ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే. ఆ నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ రోజు బీఆర్ఎస్ మంత్రులుగా పనిచేస్తున్నారు. మేం ఏనాడూ కాంగ్రెస్‌ పార్టీతో, బీఆర్ఎస్‌తో జట్టుకట్టేదు. ఒంటిచేత్తో చిత్తశుద్ధితో ఏన్నికల్లో పాల్గొన్నాం’’ అని అన్నారు.

Tags:    

Similar News