Cabinet Meeting : ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక చర్చలు
ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. శనివారం అసెంబ్లీలో భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై కేబినెట్లో చర్చించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ సర్కార్ భావించింది. అయితే న్యాయమూర్తుల కొరత ఉన్నందున సిట్టింగ్ జడ్జిలను ఇవ్వలేమని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఈ క్రమంలో రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలని సర్కార్ ఆలోచిస్తున్నారు. ఈ అంశాన్ని కేబినెట్ లో నిర్ణయించే అవకాశం ఉంది. వీటితో పాటు బడ్జెట్ సమావేశాలు, ఇతర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
మరోవైపు అసెంబ్లీలో రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీ చర్చించనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుండగా.. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాస రెడ్డి బలపరుస్తారు. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చర్చకు సమాధానం ఇస్తారు. మండలిలో జీవన్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టనుండగా.. మహేష్ కుమార్ గౌడ్ బలపరుస్తారు.