CM Revanth Reddy: హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. కాగా, స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వార్షిక సమ్మిట్‌లో పాల్గొని తెలంగాణకు రూ.40,232 కోట్ల మేర పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గతేడాది సమ్మిట్‌లో రూ.19,900 కోట్లు మాత్రమే వస్తే ఈసారి మాత్రం రెండింతల కంటే ఎక్కువ వచ్చాయి. గడిచిన మూడేండ్లలో వచ్చిన మొత్తం పెట్టుబడులను కలిపి పోల్చినా ఈ యేడు రానున్న ఇన్వెస్టుమెంట్లే అధికం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం అధికారులు, మంత్రుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లు అయ్యింది.
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకముందే 45 వేల కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డి కి దక్కుతుందని జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆంగ్ల భాషను వ్యతిరేకించిన కేటీఆర్ పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే, మన భాష మన భావం ముఖ్యం తప్ప ఏదో ఇంగ్లీష్ వచ్చింది కదా అని నాలుగు ముక్కలు మాట్లాడి అడ్డగోలుగా ట్రోల్ చేయడం సరైనది కాదని కాంగ్రెస్ నేతలు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత స్వేచ్చాయుత జీవితం గడుపుతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. మూసి రివర్ ను సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మాదిరిగా తెలంగాణలో అభివృద్ధి చేయాలని ఆలోచనలలో ఉన్నట్లు తెలిపారు.