మధ్యాహ్నం సాయిచంద్‌ అంత్యక్రియలు.. గుర్రంగూడకు సీఎం కేసీఆర్‌

Update: 2023-06-29 06:14 GMT

తెలంగాణ ఉద్యమ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందారు. గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రి నుండి ఆయన మృతదేహాన్ని బిన్ రెడ్డి సమీపంలోని గురంగూడలోని ఆయన నివాసానికి తరలించారు. సాయిచంద్ మరణవార్త తట్టుకోలేక పోయిన అతని భార్య, తండ్రి మృతదేహంపై పడి బోరుమని ఏడ్చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వారి రోదనలు చూసి కంటతడి పెట్టారు. గుండెలు పగిలేలా ఏడవడం తో అక్కడకు వచ్చిన నాయకుల మనసులను తీవ్రంగా కలిచివేసింది.

భర్త భౌతికకాయాన్ని చూడగానే భార్య బోరున విలపించింది. ఆమె తల్లడల్లుతున్న తీరు చూసి అక్కడ ఉన్నవారి గుండె తరుక్కుపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అక్కడ ఉన్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు. శవపేటికలో ఉన్న భర్త భౌతికకాయాన్ని చూసి సాయిచంద్‌ భార్య తట్టుకోలేకపోయింది. సాయి ఎంత పని చేశావంటూ బోరుమన్నది. సాయిచంద్ మృతి పట్ల బీఆర్ఎస్ శ్రేణులు సైతం కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన పాడిన పాటలను తల్చుకుని విలపిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత బీఎన్ రెడ్డి నగర్‌లోని సాహెబ్ నగర్ స్మశాన వాటికలో సాయిచంద్ అంత్యక్రియలు జరుగనున్నాయి.

ఇక గుర్రంగూడలోని సాయిచంద్ స్వగృహం నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభంకానుండగా ... మరికాసేపట్లో సాయిచంద్‌ నివాసానికి సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. సాయిచంద్‌ భౌతికకాయానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు నివాళులర్పించారు. గుర్రంగూడలోని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రులు సాయిచంద్‌ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతకుముందు గచ్చిబౌలిలోని కేర్‌ హాస్పిటల్‌లో మంత్రి హరీశ్‌ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఎమ్మెల్యే నోముల భగత్‌.. సాయిచంద్‌ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.




 


Tags:    

Similar News