Palamuru Rangareddy : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం కేసీఆర్..

By :  Kiran
Update: 2023-09-16 11:26 GMT

రాష్ట్ర చరిత్రలోనే మరో అపూర్వ ఘట్టం ఆవిష్కృత‌మైంది. దశాబ్దాలుగా సాగు నీటి కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లావాసుల చిరకాల వాంఛ సాకారమైంది. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నార్లాపూర్‌ పంప్‌ హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్‌ చేసిన ముఖ్యమంత్రి ఎత్తిపోతలను ప్రారంభించారు. ఆ తర్వాత అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి పట్టారు.

ఉమ్మడి పాలమూరుతో పాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించే లక్ష్యంతో తెలంగాణ సర్కారు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. రూ.35వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో పనులు ప్రారంభించింది. ప్రాజెక్టు తొలి దశలో తాగు నీరు, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రాజెక్టు తొలి దశలో భాగంగా తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను నాగర్‌కర్నూల్‌ జిల్లా శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించింది. కేపీ లక్ష్మీ దేవిపల్లి మినహా అన్ని ప్యాకేజీల పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టగా అవి తుది దశకు చేరుకున్నాయి. ఇక ప్రాజెక్టు ద్వారా నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌ నగర్‌, కొడంగల్‌, నారాయణపేట, మక్తల్‌, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్‌, తాండూర్‌, చేవెళ్ల, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,226 గ్రామాలకు తాగు, సాగు నీరు అందనుంది.


Tags:    

Similar News