Gaddar : గద్దర్‌కు కేసీఆర్ నివాళి.. హరీశ్ సహా మరికొందరి వీడ్కోలు
ప్రజా గాయకుడు గద్దర్‌కు పలువురు రాజకీయ, సినీరంగ, ప్రజాసంఘాల నేతలు ప్రగాఢ నివాళి అర్పిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని ఆల్వాల్ భూదేవి నగర్‌లోని ఆయన నివాసం కన్నీటి సంద్రమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గద్దర్ భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. ఆయన భార్యాపిల్లలను ఓదార్చారు. హరీశ్ రావు, తలసాని తదితరులు కూడా గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అంతకుముందు గద్దర్ భౌతిక కాయాన్ని ఎల్బీ స్టేడియం నుంచి ఆయన ఇంటికి తీసుకొచ్చారు. అంత్యక్రియలు మరికాసేపట్లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరగనున్నాయి. అల్వాల్ మహాభోది స్కూల్ గ్రౌండ్‌లో బౌద్ధమత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 77 ఏళ్ల గద్దర్ అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో ఆదివారం కన్నుమూశారు. నాలుగు దశాబ్దాల పాటు తన పాటలతో ప్రజా ఉద్యమాలకు గొంతునిచ్చిన ఆయనకు అభిమానులు భారమైన హృదయాలతో వీడ్కోలు పలుకుతున్నారు.