రేవంత్‌ను ఓడగొడితే.. ఎన్ని వందల కోట్లయినా ఇస్తా.. కొండగల్ సభలో కేసీఆర్

By :  Lenin
Update: 2023-11-22 12:49 GMT

బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని, పాలమూరులో సిరులు పంటలు పండతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ డొల్ల హామీలను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ పనితీరును గమనించి ఓటేయాలని కోరారు. ఆయన బుధవారం కొడంగల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘రేవంత్ భూకబ్జాలు చేశాడు. అతని నోరు గబ్బు. జైల్లో చిప్పకూడా తిన్నా సిగ్గరాలేదు. పాలమూరులో జిల్లాలో ఎన్నో కబ్జాలకు పాల్పడ్డాడు. వీడిని తిట్టడం, వాడిని తిట్టడం తప్ప మరో పనిలేదు. తొమ్మిదేళ్లలో రేవంత్ కొండగల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. అతణ్ని ఎన్నికల్లో ఓడిస్తే ఎన్ని వందల కోట్లయినా ఇస్తా’’ అని అన్నారు. రేవంత్ కొడంగల్‌తోపాటు కామారెడ్డిలో తనపైనా పోటీ చేస్తున్నాడని, అతనికి బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు.

‘‘రేవంత్ ఓ దొంగ. అవినీతిపరుడు. కాంగ్రెస్ టికెట్లు అమ్మకున్నాడని ఆ పార్టీవాళ్లే చెబుతున్నారు. గాంధీ భవన్‌పై రాళ్లు పడ్డాయి. రేవంత్ తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిండు. ఉస్మానియా వర్సిటీ విద్యార్థులను అడ్డా కూలీలు అన్నాడు. అరకోటి రూపాయలతో ఎమ్మెల్యేను కొంటూ దొరికిపోయాడు. ఇప్పుడు కామారెడ్డిపై నాపైకి పోటీకి వచ్చాడు. ఇక్కడా, అక్కడా అతణ్ని ఓడగొట్టాలే. ఆ పని చేస్తే మీకు ఎన్ని వందల కోట్లయినా ఇస్తా’’ అని హామీ ఇచ్చారు. కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ప్రజల మనిషి అని కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. అతణ్ని గెలిపిస్తే కొడంగల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, తానే స్వయంగా వచ్చి పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News