మేం సేవకులం, రేపు ప్రజాదర్బార్... రేవంత్ తొలి ప్రసంగం

Update: 2023-12-07 10:08 GMT

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని, అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుబడుతుందని కొత్త సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు ఈ రోజే స్వేచ్ఛ లభించిందని, మార్పు మొదలైందని అన్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి తమకు ఓట్లేసిన ప్రజలకు, కష్టపడి పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. తాము పాలకులం కాదని ప్రజా సేవలకులమని అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి చిరునామాగా తెలంగాణను తీర్చిద్దుతామన్నారు.

గడీ కంచెలను బద్దలు కొట్టాం..

‘‘తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడలేదు. పోరాటాలతో త్యాగాలే పునాదులుగా ఏర్పడింది. పదేళ్లుగా నిరంకుశ పాలనను ప్రజలు మౌనంగా భరించారు. ప్రగతిభవన్‌ గడీ ఇనుప కంచెలను బద్దలు కొట్టించాం. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తాం.. ఆసిఫాబాద్ నుంచి ఆలంపూర్ వరకు, ఖమ్మం నుంచి కొడంగల్ వరకు సమానంగా అభివృద్ధి కావాలన్న సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్ సమిధగా మారినా ఆమె వెనక్కి తగ్గలేదు.

గుండెల్లో పెట్టి చూసుకుంటా

పదేళ్లుగా అలుపెరగకుండా కష్టపడిన పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఎన్నో త్యాగాలు చేసి, రక్తాన్ని చెమటగా మార్చి, భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసి విజయానికి సహకరించారు. విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తాను. పదేళ్లలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. మానవ హక్కులను కాలరాశారు. పదేళ్లపాటు బాధను మౌనంగా భరించిన ప్రజలు ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెచ్చారు. మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది. ప్రజలు ఇకపై ప్రగతి భవన్‌లోకి స్వేచ్ఛగా వచ్చి తమ ఆలోచనలను, ఆకాంక్షలను చెప్పొచ్చు. ఇది ప్రజల ప్రభుత్వం భాగస్వాములు. ప్రజల కోసమే పనిచేస్తామని మీ బిడ్డగా ఈ వేదిక నుంచి హామీ ఇస్తున్నా’’ అని రేవంత్ అన్నారు.


Tags:    

Similar News