Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ బిజీ బిజీ .. ఆర్థిక, రక్షణ మంత్రులతో భేటీ
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడపుతున్నారు. నిన్న అమిత్ షా సహా మరో ఇద్దరు కేంద్రమంత్రులతో భేటీ అయిన సీఎం బృందం ఇవాళ మరో ఇద్దరు కేంద్రమంత్రులను కలిశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రేవంత్ సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణకు సైనిక్ స్కూల్‌ను మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా రక్షణ శాఖ భూములు, కంటోన్మెంట్ అంశంపై చర్చించారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చించారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
అంతకుముందు యూపీఎస్‌సీ ఛైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీతో రేవంత్ భేటీ అయ్యారు. గంట పాటు సాగిన ఈ భేటీలో తొలుత యూపీఎస్సీ పనితీరు, పరీక్షల నిర్వాహణ గురించి రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత టీఎస్పీఎస్సీలో జరిగిన లోటుపాట్లు, తప్పొప్పులను యూపీఎస్సీ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వాహణ, ఫలితాల వెల్లడికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సహకరించాల్సిందిగా సీఎం కోరగా.. దానికి మనోజ్ సోనీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీలో సమూల మార్పులు చేయాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి.. ఇప్పటికే రాష్ట్ర బృందాన్ని కేరళకు పంపి అక్కడి సర్వీస్ కమిషన్ పనితీరుపై అధ్యయనం చేయించారు.