10:28 గంటలకు రేవంత్ ప్రమాణం.. 9న కృతజ్ఞత సభ

Byline :  Lenin
Update: 2023-12-05 15:51 GMT

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయమైంది. ఆయన ఈ నెల 7న గురువారం ఉదయం సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఉదయం 10.28 గంటలకు గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి రావాలని కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులను ఆహ్వానించడానికి రేవంత్ మంగళవారం సాయంత్రం ఢిల్లీవెళ్లారు. మరోపక్క.. హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఎన్నికల్లో ప్రజలు తమను గెలిపించినందుకు కృతజ్ఞతలు చెబుతూ కాంగ్రెస్ నేతలు ఈ నెల 9న శనివారం ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రేవంత్ ఆధ్వర్యంలో ఈ సభ జరగనుంది. సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 కావడం గమనార్హం. తెలంగాణ అవతరణకు తోడ్పడినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాల చెప్పాయి. కాగా, మిగ్‌జాంగ్ తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తగా ఉండాలని రేవంత్ సూచించారు. సీఎం పదవి చేపట్టకముందే ఆయన పారిపాలనకు సన్నాహాలు చేస్తున్నారు. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలని కోరారు.

Tags:    

Similar News