ముందుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైన కాంగ్రెస్..లిస్ట్ రెడీ..?

Update: 2023-06-08 14:58 GMT

కర్నాటక ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ జోష్ మీద ఉంది. ఇదే ఊపుతో తెలంగాణలోనూ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు పక్కాగా ప్రణాళికలు రచిస్తోంది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కంటే ముందుగానే పలు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైందనే టాక్ వినిపిస్తోంది. కర్నాటకలోనూ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ఆ పార్టీ గెలుపుకు కొంతమేర కలిసొచ్చింది. ఇదే ఫార్మూలను తెలంగాణలోనూ రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే 50 నుంచి 60స్థానాల్లో ముందుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపు వ్యూహంపై దృష్టి పెట్టాయి. అయితే బీజేపీ కంటే క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్.. మరింత దూకుడు పెంచింది. వివిధ సర్వేలు నిర్వహించి ప్రజాభిప్రాయం మేరకు టికెట్లు ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అందులో భాగంగా వివాదం లేని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 50 నుంచి 60 స్థానాల్లో అభ్యర్థుల లిస్ట్ రెడీ అయినట్లు సమాచారం.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంథని నుంచి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, హుస్నాబాద్ నుంచి ప్రవీణ్‌ రెడ్డి, హుజురాబాద్ నుంచి ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్​ పేర్లను పార్టీ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, మానకొండూరు నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి నుంచి విజయ రమణారావు, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్, కోరుట్ల నుంచి జువ్వాడి నర్సింగ్ రావులను ఎంపిక చేసే అవకాశం ఉంది.

వరంగల్‌ జిల్లా నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి, వరంగల్‌ పశ్చిమ నుంచి నాయిని రాజేందర్‌ రెడ్డి, వరంగల్‌ తూర్పు నుంచి కొండా సురేఖ, పాలకుర్తి నుంచి జంగా రాఘవ రెడ్డి, ములుగు నుంచి సీతక్క, భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణలు బరిలో దిగేందుకు సిద్దంగా ఉన్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధిర నుంచి భట్టి విక్రమార్క, వైరా నుంచి రాందాస్ నాయక్, అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం నుంచి పొదెం వీరయ్యలను అభ్యర్థులుగా ప్రకటించనున్నట్లు సమాచారం.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి పద్మావతి, సూర్యాపేట నుంచి ఆర్ దామోదర్ రెడ్డి, ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య, మిర్యాలగూడ నుంచి లక్ష్మారెడ్డి, భువనగిరి నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు బరిలో నిలిచే అవకాశముంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్ నుంచి నాగం జనార్ధన్‌ రెడ్డి, కల్వకుర్తి నుంచి వంశీ చంద్‌ రెడ్డి, అచ్చంపేట నుంచి వంశీ కృష్ణ, షాద్‌నగర్ నుంచి వీర్లపల్లి శంకర్‌, కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, అలంపూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మక్తల్‌ నుంచి ముదిరాజ్‌ శ్రీహరిని పోటీకి దింపేందు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నుంచి గండ్రోత్‌ సుజాత, మంచిర్యాల నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, బోథ్ నుంచి నరేష్‌ జాదవ్‌, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్‌కుమార్‌, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జుక్కల్‌ నుంచి గంగారాం, నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, నిజామాబాద్‌ రూరల్‌ నుంచి మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, కామారెడ్డి నుంచి షబీర్‌ అలీ, బోధన్‌ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డిలు బరిలో ఉన్నారు.

మెదక్ నుంచి తిరుపతి రెడ్డి, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, ఆందోల్‌ నుంచి దామోదర్‌ రాజనర్సింహ, జహీరాబాద్ నుంచి గీతారెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి నందికంటి శ్రీధర్, వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్, ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి, నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్, జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి ఆదం సంతోష్, గోషామహల్‌ నుంచి మెట్టు సాయి కుమార్, మలక్పేట్ నుంచి చెట్లోకర్‌ శ్రీనివాస్‌లు ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

వివాదాలు ఉన్నచోట్ల సర్వేల ఆధారంగా నేతలతో చర్చించి గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలని అధిష్టానం నిర్ణయించింది. అదే విధంగా ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని అంచనా వేస్తున్న టీపీసీసీ... కొన్ని నియోజకవర్గాలల్లో బయట నుంచి వచ్చే వారికి సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి నేతలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పలు సీట్లను పార్టీలో కొత్తగా చేరేవారికి కేటాయించే అవకాశం ఉంది. ఏదిఏమైనా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది.

Tags:    

Similar News