డాక్టర్ల కార్ఖానా తెలంగాణ.. 5 నుంచి 28కి...ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది?

Update: 2023-09-15 06:53 GMT

తెలంగాణ ప్రభుత్వం వైద్యవిద్యలో దేశంలో అగ్రగామిగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు(శుక్రవారం) రాష్ట్రంలో 9 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించనున్నారు. గత ఏడాది కూడా ఒకేసారి 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన కేసీఆర్ ప్రభుత్వం వైద్యవిద్యను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు పట్టుదలతో జిల్లాకొక మెడికల్ కాలేజీ స్థాపిస్తోంది. ఈరోజు సీఎం కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, జయంశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, జనగామ జిల్లాల్లోని మెడికల్ కాలేజీలను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అన్ని కాలేజీల్లో ఈ రోజు నుంచే ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం దేశంలో వైద్యవిద్యకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మెడికల్ సీట్లు, ఆధునిక వసతుల కల్పనలో ముందుకు దూసుకెళ్తోంది. ప్రతి లక్ష జనాభాకు 22 మంది డాక్టర్లను తయారు చేస్తూ చరిత్రను తిరగ రాస్తోంది.

తెలంగాణ అవతరకు ముందు..

తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా తనకు అందుబాటులో ఉన్న నిధులతో వైద్యవిద్యను గణనీయంగా అభివృద్ధి పరిచింది. రాష్ట్ర అవతరించే నాటికి కేవలం 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవి. 1946లో ఉస్మానియా, 1954లో గాంధీ కాలేజీలు ఏర్పాటయ్యాయి. 1956లో ఉమ్మడి ఆంధప్రదేశ్ అవతరించాక వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీ, ఆదిలాబాద్‌ రిమ్స్‌, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉనికిలోకి వచ్చాయి. దాదాపు 60 ఏళ్ల ఉమ్మడి ఏపీ చరిత్రలో తెలంగాణలో నెలకొల్పింది కేవలం మూడు మాత్రమే. తెలంగాణ వచ్చే నాటికి కేవలం నాలుగు జిల్లాల్లో మాత్రమే ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలు ఉండేవి.

రాష్ట్రం వచ్చాక

తెలంగాణ అవతరిచాక ప్రభుత్వం వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి సాగునీటి ప్రాజెక్టులకు ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో వైద్యసేవలను ప్రజలకు మరింత చేరువ చేయడాని అంతే ప్రాధాన్యం ఇచ్చింది. తొమ్మిదేళ్లలో 28 మెడికల్‌ కాలేజీలను స్థాపించి తెలంగాణను డాక్టర్ల కార్ఖానాగా మార్చింది. కాలేజీల పెంపును శాతం లెక్కల్లో చెప్పాలంటే 480 శాతం పెరుగుదల. రాష్ట్రం అవతరించే నాటికి ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 850 ఉండగా ప్రస్తుతం సీట్ల సంఖ్య 4590. మెడికల్ పీజీ సీట్ల సంఖ్య కూ 515 నుంచి 1,270కు పెరిగింది. ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 2023-24లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,118 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో అందులో సింహభాగం 900 సీట్లు తెలంగాణవే.

అందరికీ లబ్ధి..

మెడికల్ కాలేజీల స్థాపన, అభివృద్ధి ఏదో సంస్థల వ్యవహారం కాదు. ప్రైవేటు మెడికల్ కాలేజీల లక్ష్యం లాభాపేక్ష కాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆశయం ప్రజాసంక్షేమం. ఖరీదైన వైద్యవిద్య ఈ కాలేజీల సంఖ్య పెరగడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు కూడా అందుబాటులోకి వస్తోంది. రిజర్వేషన్ అమలు వల్ల ఇది సాధ్యమవుతోంది. తల్లిదండ్రులు లక్షల ఖర్చు చేసి, అప్పులు తెచ్చి పిల్లలను డాక్టర్ కోర్సులు చదవించడానికి విదేశాలకు పంపాల్సిన అగత్యం ఉండదు. మెడికల్ కాలేజీ స్థాపనతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఒక్కో కాలేజీ 30కిపైగా విభాగాలు ఉంటాయి. డాక్టర్ల నుంచి క్లీనింగ్ వరకు రెండువేల మంది ఉద్యోగులు అవసరం అవుతారు. అనుబంధ ఆస్పత్రులో వేలమంది పేషంట్లకు సేవలు అందుతాయి.

ఎలా సాకారమైంది?

తెలంగాణ ప్రభుత్వం నిధులకు వెనకాడకుండా వైద్యరంగాన్ని అభివృద్ధి చేస్తోంది. బడ్జెట్లో భారీ కేటాయింపులు జరుపుతోంది. తాజా బడ్జెట్‌లో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ. 12,378 కోట్లు కేటాయించారు. కేసీఆర్ పట్టుదల, మంత్రి హరీశ్ రావు చొరవ, ఆయా ప్రభుత్వ విభాగాల్లోని అధికారుల కృషితోనే ఈ కల సాకారమైంది.





Tags:    

Similar News