తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు మరోసారి వార్తల్లోకెక్కారు. తన మాటలు, చేష్టలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఆయన తాజాగా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. తాజాగా ఈ వార్తలపై శ్రీనివాస రావు క్లారిటీ ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ
డీహెచ్ శ్రీనివాసరావు ఏం మాట్లాడినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రార్థనల వల్లే కొవిడ్ మహమ్మారి నుంచి బయట పడ్డామని ఒకసారి.. తాయెత్తు కట్టుకున్నందుకే బతికి బట్టకట్టానని మరోసారి ఇలా ఆయన చేసిన కామెంట్లతో చాలాసార్లు వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. నిజానికి రాజకీయాలపై ఆసక్తిని తన మాటలు, చేతల ద్వారా ఆయన ఎన్నోసార్లు బయటపెట్టుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయన వాలంటరీ రిటైర్మెంట్కు దరఖాస్తు చేసుకున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
కొత్తగూడెం నుంచి పోటీ
గడల శ్రీనివాసరావు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరావు సైతం కాంగ్రెస్ తరఫున అదే స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొత్తగూడెంలో ఈసారి ఇద్దరు శీనులు తలపడతారని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ పొత్తులో భాగంగా కేసీఆర్ సీపీఐకు కేటాయిస్తే కూనంనేని ఆ సీటు నుంచి పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. అప్పుడు గడల శ్రీనివాసరావుకు వేరే నియోజకవర్గం నుంచి బరిలో దింపుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో వాలంటరీ రిటైర్ మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారనే ప్రచారంపై శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. తాను వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేశాననే ప్రచారం అవాస్తవమని ఆయన గురువారం మీడియాకు లేఖ విడుదల చేశారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలందరికీ తెలియజేస్తానని స్పష్టం చేశారు.
కేసీఆర్ ఆదేశిస్తే
కొత్తగూడెంలో ప్రజలకు సేవ చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్న శ్రీనివాస రావు .. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ తనకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు అందరూ కోరుకుంటే కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమని శ్రీనివాసరావు మనసులో మాట బయటపెట్టారు. ఒకవేళ సీఎం కేసీఆర్ చెప్తే తప్పకుండా ఆయన ఆదేశాలు పాటిస్తానని అన్నారు. అప్పటి వరకు దయచేసి అసత్యాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.