Telangana Elections Notification : తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 10 లోపే!

Byline :  Mic Tv Desk
Update: 2023-09-28 06:51 GMT

కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు వచ్చే నెల 3 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌పై ఊహాగానాలు పుంజుకన్నాయి. అక్టోబర్ 10 లోపే అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విదలయ్యే అవకాశం ఉందని ఈసీ వర్గాలు వెల్లడించాయి. 2018నాటి ముందస్తు ఎన్నికలకు కూడా అప్పట్లో అక్టోబర్ 7నే నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం.

ఈసీ కమిషన్ సభ్యులు ముగ్గురు రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనలో ఎన్నికల సంసిద్ధతను సమీక్షించి ఢిల్లీ వెళ్తారని, తర్వాత కేంద్ర ప్రభుత్వం అనమతితో మూడు నాలుగు రోజుల్లోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశముందని కమిషన్ వర్గాలు చెప్పాయి తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటిస్తారు. మూడు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్న బృందం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షిస్తుంది. రాజకీయ పార్టీలతో, ఉన్నతాధికారులతో చర్చిస్తుంది. తొలిరోజు గుర్తింపు పొందిన పార్టీలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. రెండో రోజు ఎన్నికల ఏర్పాట్లు, సంసిద్ధతపై సమీక్ష ఉంటుంది. జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు నివేదికలు అందజేస్తారు. ఓటర్లకు సంబంధించి అంశాలపై చివరి రోజు సమీక్ష ఉంటుంది. తర్వాత విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడిస్తారు.

జమిలి ఎన్నికలు ఇప్పట్లో అసాధ్యం కనుక షెడ్యులు ప్రకారమే ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వం, ఈసీ ఏర్పాట్లు చేస్తున్నాయి. జమిలి ఎన్నికలకు వీలుగా ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెడతారని వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం ఈ వ్యవహారం జోలికి వెళ్లకుండా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లు 2029 తర్వాతే అమల్లోకి వచ్చే అవకాశముంది. జనాభా లెక్కల సేకరణ, నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలను కొలిక్కి తీసుకొచ్చాకే మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు దక్కుతాయి.


Tags:    

Similar News