Telangana Formation Day: దశాబ్ధి వేడుకలు.. 21 రోజుల షెడ్యూల్ ఇదే

Update: 2023-06-02 02:20 GMT

మరికాసేపట్లో నూతన సచివాలయం వేదికగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ ఈ దశాబ్ధి వేడుకలను సచివాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణతో ప్రారంభించనున్నారు. ఇప్పటికే సెక్రటేరియట్ ప్రధాన ద్వారం ముందు వేడుకల ఏర్పాట్లు చేసిన తరుణంలో.. సీఎం కేసీఆర్ వేడుకలకు పశ్చిమ ద్వారం నుంచి సచివాలయంలోకి ప్రవేశించనున్నారు. కేసీఆర్ తో పాటు రాష్ట్రంలోని ఆయనా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రముఖులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభిస్తారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వారి వారి కార్యాలయాల్లోని వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో ప్రారంభ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.




 రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు నేటి నుంచి ఈ నెల 22 వరకు దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఒక్కో రోజును ఒక్కో రంగానికి కేటాయించి.. ఆయా రంగాల్లో తొమ్మిదేళ్ల ప్రగతిని వివరించనున్నారు. అన్ని వర్గాల ప్రజలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల లబ్దిదారులను భాగస్వామ్యుల్ని చేస్తూ వేడుకలు నిర్వహించనున్నారు. చెరువుల వద్ద భోజనాలు, సంబురాలు, వసతి గృహాలు, అంగన్‌వాడీలు, మహిళా కార్యాలయాలు, గురుకులాలు, విద్యాసంస్థలు, ఆయా శాఖల కార్యాలయాలు ఇలా అన్ని చోట్లా మూడు వారాల పాటు ఉత్సవాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు జరగనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, రన్, హరితోత్సవం లాంటివి నిర్వహించనున్నారు. చివరి రోజు 22వ తేదీన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించేలా కార్యక్రమాలు రూపొందించారు.




 



షెడ్యూల్ ఇదే


• రైతు దినోత్సవం : జూన్‌ 3వ తేదీన వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల వద్ద తెలంగాణ రైతు దినోత్సవం నిర్వహించి.. ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా పథకాల విజయాలను వివరిస్తారు. రైతులందరితో కలిసి సామూహికంగా భోజనాలు చేస్తారు.

• సురక్షా దినోత్సవం : జూన్‌ 4వ తేదీన పోలీసుశాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహిస్తారు.

• విద్యుత్ విజయోత్సవం : జూన్ 5వ తేదీన తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం నిర్వహిస్తారు. అదే రోజున సింగరేణిలోనూ సంబురాలు జరుపుతారు.

• పారిశ్రామిక ప్రగతి ఉత్సవం : జూన్ 6వ తేదీన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’ జరుగుతుంది.

• సాగునీటి దినోత్సవం : జూన్‌ 7వ తేదీన సాగునీటి దినోత్సవం’’నిర్వహిస్తారు. సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో సభలు ఉంటాయి. హైదరాబాద్ రవీంద్రభారతిలో సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశం జరుగుతుంది. సమావేశంలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొంటారు.

• చెరువుల పండగ : జూన్‌ 8వ తేదీన‘‘ఊరూరా చెరువుల పండుగ’’నిర్వహిస్తారు. కవుల పాటల్ని వినిపిస్తారు. మత్స్యకారుల వలల ఊరేగింపు, చెరువు కట్టలపై సహపంక్తి భోజనాలు ఉంటాయి.

• సంక్షేమం సంబురాలు : జూన్‌ 9వ తేదీన తెలంగాణ సంక్షేమ సంబురాలు జరుపుతారు.

• సుపరిపాలన దినోత్సవం : జూన్ 10వ తేదీన తెలంగాణ సుపరిపాలన దినోత్సవం పేరిట అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు నిర్వహిస్తారు.

• సాహిత్య దినోత్సవం : జూన్ 11వ తేదీన తెలంగాణ సాహిత్య దినోత్సవం’నిర్వహిస్తారు.

• తెలంగాణ రన్ : జూన్ 12వ తేదీన తెలంగాణ రన్ నిర్వహిస్తారు.

• మహిళా సంక్షేమ దినోత్సవం : జూన్ 13వ తేదీన మంగళవారం తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తారు.

• వైద్యారోగ్య దినోత్సవం : జూన్ 14వ తేదీన వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి, నిమ్స్ విస్తరణ పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారు.

• పల్లె ప్రగతి దినోత్సవం : జూన్ 15వ తేదీన తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహిస్తారు.

• పట్టణ ప్రగతి దినోత్సవం : జూన్‌ 16వ తేదీన తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహిస్తారు.

• గిరిజనోత్సవం : జూన్ 17వ తేదీన తెలంగాణ గిరిజనోత్సవం జరుపుతారు.

• మంచినీళ్ల పండగ : జూన్ 18వ తేదీన తెలంగాణ మంచి నీళ్ల పండగ నిర్వహిస్తారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాల నీరు ఇస్తున్న తీరును వివరిస్తారు.

• హరితోత్సవం : జూన్‌ 19వ తేదీన తెలంగాణ హరితోత్సవం నిర్వహిస్తారు.

• విద్యా దినోత్సవం : జూన్ 20వ తేదీన తెలంగాణ విద్యా దినోత్సవం నిర్వహిస్తారు. అదే రోజు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మన ఊరు- మన బడి పాఠశాలలను ప్రారంభిస్తారు.

• ఆధ్యాత్మిక దినోత్సవం : జూన్‌ 21వ తేదీన తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహిస్తారు.

• అమరవీరుల సంస్మరణ దినోత్సవం : జూన్ 22వ తేదీన అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. హైదరాబాదు ట్యాంక్ బండ్‌పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఆ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి.. సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించే సభలో పాల్గొంటారు.


Tags:    

Similar News